కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టక ముందే సవాళ్ల మీద సవాళ్లు ఎదురొస్తున్నాయి. కాంగ్రెస్‌తో మంత్రి పదవుల పంపకం.. కొలిక్కి రాక.. కేబినెట్‌ను ఏర్పాటు చేసుకోలేక సతమతమవుతూంటే… మరో వైపు నుంచి రుణమాఫీ కోసం రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రుణమాఫీ చేయాల్సిందేనని.. యడ్యూరప్ప.. అసెంబ్లీలో ప్రభుత్వానికి వారం రోజులు మాత్రమే గడువిచ్చారు. ఆ లోపు రైతులకు రుణమాఫీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. బంద్‌కు పిలుపునిస్తామని వార్నింగ్ ఇచ్చారు. విశేషం ఏమిటంటే.. కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రైతు రుణమాఫీ పథకంపై యూటర్న్ తీసుకున్నారని అక్కడి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని కుమారస్వామి ఖండించారు.
యడ్యూరప్ప ఇచ్చిన గడువు ముగియడంతో.. రైతుల్లో అపోహలు పెరగకుండా.. హడావుడిగా కుమారస్వామి… రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పంటల పేరుతో రుణాలు తీసుకుని. కార్లు, బైకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకున్న వారికి రుణమాఫీ చేయడం కరెక్ట్ కాదన్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి మీడియాలో హైలెట్ అయింది. మొత్తం కర్ణాటకలో ఉన్న 30 జిల్లాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో రుణమాఫీపై సుదీర్ఘంగా చర్చించారు. తనకు పదిహేను రోజుల సమయం కావాలని కుమారస్వామి రైతు ప్రతినిధులను కోరారు. రైతులందరికీ రుణ విముక్తి కల్పిస్తామనీ… రెండు దశల్లో మొత్తం రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో రైతుల రుణాలు రూ.53 వేల కోట్లు ఉండవచ్చని అంచనా.
ఈ రుణమాఫీ అంశంతోనే… కుమారస్వామిని ఇబ్బంది పెట్టాలని యడ్యూరప్ప ఇప్పటికే స్కెచ్ గీసుకున్నారు. భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. దీంతో కుమారస్వామికి మొదటి గండం రుణమాఫీ రూపంలోనే రానుంది. అదే సమయంలో కాంగ్రెస్‌తో పదవుల పంపకం అంశం కొలిక్కి రావడం లేదు. కొన్ని శాఖల విషయంలో… ఇరు పార్టీలు పట్టు విడవడం లేదు. కుమారస్వామి సోదరుడు..రేవణ్ణ… ఇంధన శాఖ కావాలని పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ కూడా అదే శాఖ కోరుతున్నారు. ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తెలియక కుమారస్వామి సతమతమవుతున్నారు. పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరిపితే కానీ.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కుమారస్వామిది. పోరాటం చేసి.. సీఎం పదవి దక్కించుకున్నా.. తొలి రోజు నుంచే.. కుమారస్వామికి చుక్కలు కనిపిస్తున్నాయి.