Lik Movie Review
Lik Movie Review
తెలుగు360 రేటింగ్: 2/5
ప్రదీప్ రంగనాథ్ ని ఫ్యూచర్ సూపర్ స్టార్ గా డిక్లేర్ చేసేశారు సినీ జనాలు. వరుసగా మూడు హిట్లు కొట్టాడు. అవి కూడా అలాంటి ఇలాంటి హిట్లు కావు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్… అన్నీ యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలే. తన ఆటిట్యూడ్ నే స్టైల్ గా మార్చుకొని, ఫ్యాన్స్ ని సంపాదించుకొన్నాడు. ప్రదీప్ రంగనాథ్ సినిమాలకు తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. అందుకే ‘లిక్’ (లవ్ ఇన్సురెన్స్ కంపెనీ) సినిమాపై ఫోకస్ పెంచారు తెలుగు ఆడియన్స్. ఈసారి ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ప్రదీప్ రంగనాథ్.. మళ్లీ యూత్ మనసుల్ని గెలుచుకొన్నాడా? ఇంతకీ కాన్సెప్ట్ లో ఉన్న క్రేజీనెస్ ఎంత?
అది 2040వ సంవత్సరం. ఇప్పుడున్న టెక్నాలజీ పదింతలు పెరిగింది. స్మార్ట్ ఫోన్ జనాల్లోకి మరింతగా చొచ్చుకుపోయింది. దాన్ని ఆసరాగా తీసుకొని ‘లిక్’ అనే యాప్ ని కనిపెడతాడు సూర్య (సూర్య). ఆ యాప్‌కి ప్రపంచమే దాసోహం అయిపోతుంది. ప్రేమికుల మధ్య ప్రేమ ఉందా, లేదా అనే విషయాన్ని నిర్దారించడానికి లవ్ స్కోర్ అనే సిస్టమ్ తీసుకొస్తాడు. క్రెడిట్ స్కోర్ లా లవ్ స్కోర్ 60 దాటితే వాళ్ల ప్రేమ సక్సెస్. లేదంటే లేదు. ఈ లవ్ స్కోర్ చూసుకొనే ప్రేమలో పడుతుంటుంది యువత.
మరోవైపు వాస్ (ప్రదీప్ రంగనాథ్) స్మార్ట్ ఫోన్ లకు దూరంగా బతుకుతుంటాడు. దానికో కారణం ఉంది. ఓ వర్షం కురిసిన రోజు.. రోడ్డుపై దీమా (కృతిశెట్టి)ని చూసి ఇష్టపడతాడు. ధీమా కూడా వాస్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ఒక్కటవుదామనుకొన్న తరుణంలో వీళ్ల లవ్ స్కోర్ ‘3’ గా తేలుతుంది. మనుషుల కంటే యాప్స్ ని ఎక్కువగా నమ్మే కృతి.. వాస్ కి బ్రేకప్ చెబుతుంది. ఈ సాంకేతికత అంతా డొల్ల అని, మనిషి హృదయంలో ఏముందో కనిపెట్టడం ఏ మిషన్ కూ సాధ్యం కాదని నిరూపిస్తానని సవాల్ చేస్తాడు వాస్. మరి ఆ సవాల్ లో తాను గెలిచాడా లేదా? తన ప్రేమ కథని నిలబెట్టుకొన్నాడా లేదా? అనేది వెండి తెరపై చూడాలి.
కొన్ని ఐడియాలు బాగుంటాయి. వినగానే క్రేజీగా అనిపిస్తాయి. కాసేపు నవ్వుకోవడానికి, చర్చించుకోవడానికీ కావల్సినంత స్టఫ్ దొరుకుతుంది. కానీ.. వాటిని సినిమాలుగా మలచడం చాలా కష్టం. ఓ చిన్న ఐడియా రెండున్నర గంటల సినిమాగా తీర్చిదిద్దాలంటే చాలా స్టఫ్ కావాలి. అది ‘లిక్’కి సరిపోలేదు. ప్రేమని నిర్దారించడానికి ఓ యాప్ ఉండడం, దాన్ని హీరో ఛాలెంజ్ చేయడం నిజంగా మంచి కాన్సెప్ట్. కథని 2040లోకి తీసుకెళ్లి, అప్పటి యువత టెక్నాలజీకి ఇంకెంత బానిసలుగా మారిపోతారో చెప్పడం ఇంకా బాగుంది. కానీ సినిమా అంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు మాత్రమే కాదు. ఎమోషన్ కూడా. ఆ ఎమోషన్ ఈ సినిమాలో ఏ దశలోనూ పండలేదు.
కథని ప్రారంభించడానికి, వాతావరణాన్ని పరిచయం చేయడానికి దర్శకుడు కాస్త టైమ్ తీసుకొన్నాడు. ‘లవ్ స్కోర్’ అనే ఐడియాలోకి వెళ్లాక అసలు కథ మొదలవుతుంది. టెక్నాలజీకి ఎంతగా బానిసలు అయిపోతున్నామో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. అలాంటి సన్నివేశాలన్నీ మనల్ని మనం తరచి చూసుకొనేలా చేశాయి. లైకులు షేర్ల గొడవల్లో ఏం కోల్పోతున్నామో హెచ్చరిక జారీ చేశాడు. నిజానికి ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. 2040లోనే కాదు. 2026లోనూ మనం ఇలానే ఉన్నాం. కాబట్టి రిలేట్ అయిపోతాం.
హీరో, హీరోయిన్ల ప్రేమకథ మరీ నిదానంగా సాగుతుంది. ఆ లవ్ లో ఇంటెన్సిటీ లేదు. వారిద్దరూ ప్రేమలో పడినా, విడిపోయినా ఆడియన్స్ కి పెద్దగా ఫరక్ పడదు. అందుకే ఎమోషన్ క్యారీ అవ్వలేదు. ‘మిషన్ కంటే మనసు గొప్పదని నిరూపిస్తా’ అని హీరో ఛాలెంజ్ చేస్తాడు. ఇందులో నిరూపించడానికి ఏముంది? ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన విషయమే ఇది. అంటే.. కాన్ ఫ్లిక్ట్ కూడా చాలా బలహీనంగా ఉందన్నమాట. ఇంట్రవెల్ తరవాత కథ, కథనాలు రెండూ గాడి తప్పేశాయి. ఏ సన్నివేశం కూడా మనసుకి హత్తుకోదు. నిజానికి ప్రేమకు సంబంధించిన మరో కోణం ఏదో వెలికి తీస్తాడేమో అని అనిపించింది. ఇంట్రవెల్ లో హీరో కొన్ని ఎమోషనల్ డైలాగులు చెబుతుంటే ఆ ఆస్కారం మరింత ఎక్కువ కనిపించింది. కానీ సెకండాఫ్ లో దర్శకుడు దాని జోలికి వెళ్లలేదు. విలన్ ని గెలవడానికి హీరో చేసిన కృషి కూడా ఏమీ ఉండదు. అవన్నీ రెగ్యులర్ గా సాగే వ్యవహారాలే. సూర్య పాత్రని మరీ బఫూన్ గా మార్చేశారు. క్లైమాక్స్‌లో సూర్యని హీరో చిత్తు చిత్తుగా కొడుతున్నా ఎమోషన్ పండదు. కారణం.. సూర్యని మనం విలన్ గా చూడలేదు. అంత క్రూరత్వం అతని పాత్రలో కనిపించలేదు. యాప్స్ మనుషుల్ని ఎలా శాసిస్తున్నాయి అనే పాయింట్ ని దర్శకుడు లవ్ స్టోరీకే పరిమితం చేయగలిగాడు. దాన్ని ఇంకాస్త విస్త్రృతంగా రాసుకొంటే బాగుండేది. కనీసం లవ్ లో డెప్త్ లోకి వెళ్లినా, ఈ జంజీ కిడ్స్ కి అర్థమయ్యేలా ఓ ప్రేమ కథ చెప్పగలిగినా ఈ ప్రయత్నం వర్కవుట్ అయ్యేది.
లవ్ టుడే, డ్యూడ్, డ్రాగన్ లో ప్రదీప్ ఎలా కనిపించాడో, ఈ సినిమాలోనూ అలానే కనిపించాడు. తన గెటప్ లో గానీ, నటనలో గానీ ఎలాంటి మార్పూ లేదు. ఇలానే మరో రెండు మూడు సినిమాలు చేస్తే మొనాటినీ వచ్చేస్తుంది. అయినప్పటికీ తన ఎనర్జీతో సినిమాని లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. కృతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ తన నుంచి నటన లాంటి పదార్థం ఆశించకూడదు. సూర్య అక్కడక్కడ సెలిల్డ్ గా, చాలా చోట్ల తనకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసుకొంటూ వెళ్లాడు. యోగిబాబు పాత్ర లో కొన్ని సెటైర్లు పడ్డాయి. ముఖ్యంగా అబ్బాయిలకు సంబంధించి.
అనిరుథ్ సంగీతం ప్లజెంట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా. 2040లోని ప్రపంచాన్ని చూపించడం అంత తేలిక కాదు. ఆర్ట్ విభావం బాగా పని చేసింది. ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. టెక్నాలజీ ఎలా ఉండబోతోందో ముందే ఊహించి చెప్పారు. కొన్ని చోట్ల క్రియేటివిటీ బాగా వర్కవుట్ అయ్యింది. ఐడియా పరంగా బాగున్న సినిమా ఇది. కానీ తెరపై పూర్తి స్థాయిలో తర్జుమా చేయడంలో టీమ్ విఫలం అయ్యింది. ప్రదీప్ రంగనాథ్ వరుస విజయాలకు.. ఈ సినిమాతో కాస్త కుదుపు ఎదురైనట్టే. దీన్ని ఓ పాఠంలా భావించి, తనని తాను దిద్దుకొని, ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
తెలుగు360 రేటింగ్: 2/5
