లోకేష్ సీఎం.. చంద్ర‌బాబు పీఎం.. జేసీ వ్యాఖ్య‌!

టీడీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు జేసీ దివాక‌ర్ రెడ్డి ఏం మాట్లాడినా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఒక్కోసారి సొంత పార్టీ తెలుగుదేశాన్నే ఇర‌కాటంలో పెట్టే విధంగా ఉంటుంది..! విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న మ‌హానాడులో ఆయ‌న మాట్లాడుతూ… కేంద్రం తీరుపై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్రత్యేక హోదా రాదు, కేంద్రం ఇవ్వ‌దు అనే విష‌యాన్ని తాను నాలుగేళ్ల కింద‌టే చెప్పాన‌ని జేసీ అన్నారు. కేంద్రంలో మోడీ ప్ర‌ధానిగా ఉన్నంత కాలం ఏపీకి హోదా అనేది క‌ల మాత్ర‌మే అని కూడా తాను ముందే చెప్పా అన్నారు. అంతేకాదు, మోడీతో దోస్తీ వ‌ద్ద‌ని కూడా చంద్ర‌బాబు చాలాసార్లు సూచించా అన్నారు! ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వ‌గానే హోదాకి బ‌దులుగా ప్ర‌యోజ‌నాల‌న్నీ వ‌చ్చేస్తాయ‌ని చంద్ర‌బాబు నాయుడు బోల్తా ప‌డిపోయార‌ని జేసీ వ్యాఖ్యానించ‌డం విశేషం.

ఇక‌, మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడుతూ… న‌వ్యాంధ్ర‌కు నారా లోకేష్ ముఖ్య‌మంత్రి అయితే త‌ప్పేముంద‌ని జేసీ అన్నారు. ఇంకోటి, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి వ‌ద్ద‌ని ఎందుకు అంటున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని కూడా జేసీ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ఏపీకి మాత్రమే ప‌రిమితం కాకూడ‌ద‌నీ, ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని జేసీ ఆకాంక్షించారు.

నిజానికి, చంద్ర‌బాబు ప్ర‌ధాని అనే చ‌ర్చ ఈ మ‌ధ్య రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తూనే ఉన్నా… దాన్ని చంద్ర‌బాబు తోసిపుచ్చుతున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ రాజ‌కీయాల్లో భాజ‌పా వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీల మెగా కూట‌మికి ఆస్కారం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌రిస్థితులు అన్నీ అనుకూలిస్తే, కేంద్రంలో మ‌రోసారి చ‌క్రం తిప్పే అవ‌కాశం టీడీపీకి రావొచ్చ‌నే విశ్లేష‌ణ‌లూ ఉన్నాయి. చంద్ర‌బాబు కూడా అంత‌వ‌ర‌కే మాట్లాడుతున్నారు. ప్ర‌ధాని అనే ఆలోచ‌న‌పై ఆయ‌న ఏమంత సీరియ‌స్ గా లేరు. రాష్ట్ర రాజ‌కీయాలే ప‌రిమితం అవుతాన‌ని చాలా స్ప‌ష్టంగానే చెబుతూ వ‌స్తున్నారు. ఇంకోటి.. జేసీ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు నారా లోకేష్ ముఖ్య‌మంత్రి అనే టాపిక్ కూడా ప్ర‌స్తుతానికి ఏమంత తీవ్ర‌మైన డిమాండ్ గానో, రాజ‌కీయ అవ‌స‌రంగానో క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత రాష్ట్ర ప‌రిస్థితి దృష్ట్యా చూసుకుంటే… చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వం, అనుభ‌వం రాష్ట్రానికి మ‌రో ఐదేళ్ల‌పాటు అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయ‌మే కాస్త ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మ‌రి, జేసీ ఒక అడుగు ముందుకేసి… లోకేష్ సీఎం, చంద్ర‌బాబు పీఎం అనేశారు! దీన్ని పార్టీ వ‌ర్గాలు ఎలా తీసుకుంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.