లోకేష్ అవుతాడా బాహుబలి…

Lokesh to take over the reins of the tdp party
Lokesh to take over the reins of the tdp party

లోకేష్ ఏం చెప్తాడు. పార్టీలో నెంబర్ 2గా అనధికారికంగా చెలామణీ అవుతున్న చినబాబు రూటే సెపరేటా? అధికారికంగా ఏ పదవిలో లేనప్పటికీ లోకేష్ చుట్టూ ఇప్పుడు అధికారం ఉందన్నది నిర్వివాదం. కొత్త రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా లోకేష్ ను బాబు అధికార పీఠం దగ్గరకు చేరుస్తారా? లేక అదే మౌనం దాల్చుతారా..? అంటే పార్టీ నేతలెవ్వరికీ తెలియని సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీగా ఈ విషయంగా మిగిలిపోతుందా?

తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ తిరుపతి మహానాడులోనూ తనదైన పాత్ర పోషించాడు. పార్టీ నేతలందిరినీ కలుపుకొని వెళ్తూ… మహానాడు ఏర్పాట్లను తన కనుసన్నల్లో నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే పార్టీలో తనకంటూ ఒక టీం తయారు చేసుకుంటున్న లోకేష్ మహానాడు ఏర్పాట్ల విషయంలోనూ నేతలకు అనేక సూచనలిచ్చాడు. ఎక్కడా ఇబ్బంది కలక్కుండా, సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని… చినబాబు పార్టీ నేతలకు, శ్రేణులకు సూచనలిందాయ్.

ఇప్పటికే పార్టీలో అనేక వ్యవహారాలను తండ్రికి మద్దతుగా నిర్వహిస్తున్న లోకేష్ పార్టీ పగ్గాల దిశగా ముందుగా సాగుతున్నాడు. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ వచ్చే రోజుల్లో కీలక బాధ్యతలు చేపడతారని కీలక నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గానూ లోకేష్ పార్టీ కేడర్ తో డైరెక్ట్ సంబంధాలు నెరపుతున్నారు. పార్టీలో తాను చెప్పిందే శాసనమన్న అభిప్రాయం కొంత మంది నేతల్లో ఉంది. బాబు ఏవిధంగానైతే సమష్టి నిర్ణయమన్న అభిప్రాయాన్ని కలిగిస్తారో… లోకేష్ తీరు అందుకు భిన్నమన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈవిషయంపై పెద్దగా ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేవు. లోకేష్ కు మద్దతివ్వకపోతే వచ్చే రోజుల్లో తమకు కష్టమన్న భావన పలువురిలో ఉంది.

అయితే ఇదే సమయంలో లోకేష్ కు యాక్టివ్ గా మద్దతిస్తున్న పార్టీ యువనేతలు పలువురు యువనేతకు పదవి కట్టబెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు పలువురు లోకేష్ కోసం త్యాగం చేయడానికి ముందుకు కూడా వచ్చారు. అయితే వాటిపై ఇంత వరకు లోకేష్ పెదవివిప్పలేదు. అలాగని ఖండించనూ లేదు. కేటీఆర్ మాదిరిగా తాను మంత్రివర్గంలో చేరాలని, ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు రేపు మాహనాడులో బాబును డిమాండ్ చేసే అవకాశం ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ ను ముందుకు నడిపించి లీడర్ గా ఎదిగేలా ఏర్పాటు చేసిన పతకా సన్నివేశాన్ని… రేపు మహానాడులో బాబు, లోకేష్ విషయంలో చేయగలుగుతారా? చేస్తే అది ఎంత వరకు అన్నది ఇప్పుడు ప్రశ్న. లోకేష్ విషయంలో బాబుకు ఫుల్ క్లారిటీ ఉంది. సమర్థవంతమైన లీడర్ షిప్… క్రైసిస్ మేనేజ్మెంట్లో తనయుడికి ఢోకా లేదని బాబుగారు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేల వలసలు, తలెత్తుతున్న సమస్యలను లోకేష్ స్వయంగా డీల్ చేస్తున్నారని… ఎలాంటి సమస్యలు తలెత్తినా అధిగమిస్తున్నారని బాబు భావిస్తున్నారు. ఇలాంటి డీల్స్ లోకేష్ కు సరైన పరీక్ష అని బాబు కూడా నమ్ముతున్నారు. బీజేపీ విషయంలో పెద్దగా ఇప్పుడు పార్టీ నేతలెవరూ కామెంట్ చేయని పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వారికి మోడీ మద్దతు ఎంత అవసరమో చాలా బాగా తెలుసు.

ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండటం చేత లోకేష్ ను యాక్టివ్ పాలిటిక్స్ లోకి బాబు దింపే ప్రయత్నం చేయోచ్చు. అధికారికంగా పదవి ఉండటం ఒక ఎత్తు… సీఎం తనయుడిగా పరోక్ష అధికారం మరో ఎత్తు కదా… గతంలో కార్యకర్తలకు ప్రమాద బీమా, ఆరోగ్య సదుపాయాలను స్వయంగా మానిటర్ చేసిన లోకేష్ ఈసారి పార్టీ కార్యకర్తలకు మరిన్ని వరాలిచ్చేందుకు బాబు వద్ద పర్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసేవారి కోసం తాను పనిచేస్తానని… పార్టీని పదికాలాల పాటు చల్లగా చూసుకోవాలన్న అభిమాతం అందరికీ ఉండాలన్న అభిప్రాయాన్ని రేపు సభాముఖంగా లోకేష్ వివరించే అవకాశం ఉంది. అటు లోకేష్, ఇటు చంద్రబాబు రేపు సభా ముఖంగా ఏం చెబుతారన్నది సస్పెన్స్ ఏమీ కాదు. పెద్దగా సంచలనాలు ఉండవని చెప్పొచ్చు. అయితే లోకేష్ ను ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ లో ప్రొజెక్ట్ చేయకపోతే ఎలా అన్న ప్రశ్నకు బాబు బదులివ్వాల్సిందే కదా… అప్పుడే లోకేష్ బాహుబలి కాగలుగుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com