గ్లోబల్ ఐటీ కంపెనీల్లో నిరంతరం సాగుతున్న లేఆఫ్స్ ప్రకటనలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై, ముఖ్యంగా ఖరీదైన లగ్జరీ ఇళ్ల విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే లక్షల్లో జీతం, కోట్లలో విల్లా అనే భరోసా ఉండేది. కానీ, ప్రస్తుతం ఏ క్షణాన ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో టెక్ నిపుణులు భారీ పెట్టుబడుల జోలికి వెళ్లడానికి వెనుకాడతున్నారు.
గతంలో 2 కోట్ల నుంచి 5 కోట్ల విలువైన ఫ్లాట్లను ధైర్యంగా బుక్ చేసుకున్న వారు కూడా, ఇప్పుడు ఆ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు లేదా తమ బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నారు. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, తెల్లాపూర్, కోకపేట వంటి ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా ప్రీమియం ఫ్లాట్ల విక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. భారీ ఈఎంఐల భారం మోస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం కంటే, ప్రస్తుతం ఉన్న అద్దె ఇళ్లలోనే కొనసాగడం ఉత్తమమని మెజారిటీ ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఏఐ కారణంగా ఉద్యోగ భద్రతపై నెలకొన్న సందిగ్ధత వారిని దీర్ఘకాలిక ఆర్థిక భారాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటోంది. దీంతో మార్కెట్లో వెయిట్ అండ్ వాచ్’ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా ఇప్పుడు తక్కువ ధర గల ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 60 లక్షల నుంచి 80 లక్షల లోపు లభించే ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుండగా, లగ్జరీ విభాగంలో మాత్రం విచారణలు తగ్గుతున్నాయి. అటు బిల్డర్లు కూడా విలాసవంతమైన ప్రాజెక్టుల కంటే, మధ్యతరగతి ఐటీ ఉద్యోగులను ఆకర్షించేలా కాంపాక్ట్ , బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడిదారుల కంటే సొంత అవసరాల కోసం కొనేవారే ఇప్పుడు మార్కెట్లో కీలకంగా మారారు.
ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా బెంగళూరు, పూణే వంటి ఐటీ నగరాల్లోనూ కనిపిస్తోంది. ఐటీ రంగంలో స్థిరత్వం ఏర్పడే వరకు లేదా వడ్డీ రేట్లు తగ్గే వరకు ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడం వల్ల ఐటీ హబ్ పరిసరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నా, భారీ రుణాలు తీసుకుని ఇంటిని కొనుగోలు చేయడం కంటే అద్దె కట్టడమే సురక్షితమని టెక్ నిపుణులు నిర్ణయించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ రివర్స్ ట్రెండ్ మరికొన్ని నెలల పాటు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
