మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పరిణామాలు ఇప్పుడు సుసాధ్యమవుతున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా చీలికలు, పేలికలతో అట్టుడికిన రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కలసిపోయే సీజన్ మొదలైనట్లు కనిపిస్తోంది. శివసేన రెండు ముక్కలైన తర్వాత, థాక్రే వారసత్వం కోసం జరిగిన పోరాటం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు అదే బాటలో శరద్ పవార్ కుటుంబం కూడా పయనిస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాజకీయంగా విడిపోయిన బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ పవార్ మళ్ళీ ఒక్కటి కావడం ద్వారా ఏకీకృత ఎన్సీపీ దిశగా అడుగులు పడుతున్నాయి.
రెండు ఎన్సీపీలు ఒక్కటి – ఎన్డీఏలో భాగం
రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన శరద్ పవార్, తన రాజకీయ వారసురాలిగా సుప్రియా సూలేను నిలబెట్టిన తరుణంలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఎన్డీయే కూటమిలో చేరారు. అయితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు , క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఒత్తిడి మేరకు తిరిగి కుటుంబం అంతా ఏకం కావడమే పార్టీ మనుగడకు శ్రేయస్కరమని ఇరు వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ మళ్ళీ సొంత గూటికి చేరితే, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పవార్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతారు. సుప్రియా సూలే కేంద్ర మంత్రి అవుతారు . అంటే ఇండియా కూటమి నుంచి ఎన్సీపీ ఎన్డీఏలో చేరుతుందన్నమాట.
థాక్రే బ్రదర్స్ శివసేనను ఒక్కటి చేసే ప్లాన్
శివసేన అంటే థాక్రేలు. కానీ వారి నుంచి షిండే ఆ పార్టీని లాగేసుకున్నారు. ఇప్పుడు తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్ధవ్, రాజ్ థాక్రేలు ఒక్కటయ్యారు. ఉద్దవ్ రాజకీయాల్లోకి రాక ముందు బాల్ థాక్రే వెన్నంటి ఉండి పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి రాజ్ థాక్రే. ఉద్దవ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన బయటకు పోవాల్సి వచ్చింది. ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. కానీ ఎప్పుడూ గొప్ప ఫలితాలు సాధించలేదు కానీ ఆయనకు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. శివసేన రెండుగా చీలిపోవడం మరోవైపు ఎంఎన్ఎస్ విడిగా పోటీ చేయడం వల్ల మరాఠీ మానూస్ ఓట్లు భారీగా చీలిపోయి బీజేపీకి లాభం చేకూరుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఉద్ధవ్-రాజ్ చేతులు కలపడం వల్ల ముంబైలోని మరాఠీ ఓటర్లంతా ఒకే తాటిపైకి వచ్చే అవకాశం ఉంది.
జాతీయ రాజకీయాల్లోనూ మార్పు
బాలాసాహెబ్ థాక్రే వారసత్వం కోసం గతంలో వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏకనాథ్ షిండే అసలైన శివసేన గా తనను తాను ప్రకటించుకున్న తరుణంలో, థాక్రే కుటుంబం ఒక్కటి కావడం ద్వారా అసలైన వారసులం మేమే అనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపగలుగుతారు. థాక్రే పేరుపై ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్‌ను ఈ కలయిక మళ్ళీ నిలబెడుతుంది. ఈ కలయిక ఇద్దరు సోదరులకు రాజకీయంగా అత్యంత కీలకం. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కలిశారు.
మహారాష్ట్రలో ప్రస్తుతం సాగుతున్న ఈ పరిణామాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపనున్నాయి. బలమైన మరాఠా నాయకత్వం ఒకే తాటిపైకి రావడం అనేది అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు సవాలుగా మారవచ్చు. షిండే తన పార్టీని కాపాడుకోవడం కష్టం కావొచ్చు. థాక్రేల తర్వాత పవార్ కుటుంబం కూడా ఒక్కటైతే, రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంట్ బలం పుంజుకుంటుంది. అది రాజకీయాలను మార్చేస్తుంది.
