మంచు ఫ్యామిలీ లో ముగ్గురు హీరోలు వున్నారు. కానీ ఒక్క సినిమా కూడా సెట్ మీద లేదు. మోహన్ బాబు అంటే సీనియర్ అయిపోయారు. ఆచి తూచి చేస్తున్నారు. మంచు విష్ణుకు తన విద్యాసంస్థలతో సహా బోలెడు వ్యవహారాలు వున్నాయి. మనోజ్ సంగతి తెలియదు. మరి ఇంతకీ సినిమాల సంగతేమిటి?
ఇదే ఆరా తీస్తే, మంచు విష్ణు ఇప్పుడు ఎక్కువగా అమెరికాలో తన తరువాత సినిమా పనిలో బిజీగా వుంటున్నారని తెలుస్తోంది. కన్నప్ప, ఇంకా మరో సినిమా పనులు రెండూ అమెరికా వేదికగానే జరుగుతున్నాయని బోగట్టా. కన్నప్ప సినిమా స్క్రిప్ట్ ను పముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి తయారుచేసిన సంగతి తెలిసిందే.
ఈ స్క్రిప్ట్ ను తను హీరోగా, నిర్మాతగా తెరకెక్కించే పనిలో వున్నారు విష్ణు. దీనికి మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు డైరక్టర్ కూడా హాలీవుడ్ వ్యక్తే పని చేస్తారని తెలుస్తోంది. హాలీవుడ్ లో మాస్క్ అనో మరోటనో సినిమాను అందించిన డైరక్టర్ ఒకరు ఈ స్క్రిప్ట్ విని బాగా ఎగ్జయిట్ అయ్యారని, దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే స్వీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే మరో మాంచి స్క్రిప్ట్ ఒకటి కూడా విష్ణు కు వచ్చిందని, దానిని కేవలం హాలీవుడ్ లో, ఇంగ్లీష్ లోనే సినిమాగా మార్చే ప్రయత్నంలో వున్నారని కూడా వినికిడి. అంటే ప్రస్తుతం విష్ణు రెండు హాలీవుడ్ సినిమాలు చేసే పనిలో బిజీగా వున్నారన్న మాట.
ఈ లెక్కన మంచు విష్ణు తన స్టామినా చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లే. మరి మంచు మనోజ్ సంగతి ఏమిటో తెలియాల్సి వుంది.