వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కాకినాడకు చెందిన ఒక చర్చి ట్రస్ట్ లైసెన్స్ రెన్యువల్ చేయిస్తాననని నమ్మించి, భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. కాకినాడకు చెందిన సీబీఎన్ సీ చర్చి ట్రస్ట్ సభ్యుల ఫిర్యాదు ప్రకారం.. 2021లో ట్రస్ట్ రెన్యువల్ ప్రక్రియ కోసం వారు అప్పటి ఎంపీ నందిగం సురేష్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఈ పని పూర్తి చేయడానికి ఆయన రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఉద్దండరాయునిపాలెంలోని సురేష్ నివాసంలోనే ఈ నగదును అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా పని పూర్తి కాకపోగా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు వివరించారు.
మోసంపై బాధితులు విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేష్‌పై చీటింగ్ , బెదిరింపుల కేసు నమోదు చేశారు. అయితే, కేసు ఫైల్ అయిన విషయం తెలియగానే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంపీగా ఉన్న కాలంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
నందిగం సురేష్‌పై ఇలాంటి ఆర్థిక నేరాలు బయటపడటం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇసుక అక్రమ రవాణా, అమరావతి భూముల వ్యవహారాల్లో కూడా ఆయనపై , ఆయన బంధువులపై కేసులు నమోదయ్యాయి. ప్రతిసారి పోలీసులు చుట్టుముట్టే సమయంలో ఆయన కనిపించకుండా పోవడం కామన్ గా మారింది. నందిగం సురేష్ పదే పదే ఇలాంటి మోసాలకు పాల్పడటం వైసీపీకి కి పెద్ద తలనొప్పిగా మారింది. అధికారం ఉన్నప్పుడు సామాన్యులను, సంస్థలను మోసం చేసిన నేతలు ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకోవడానికి పరారీ కావడం వైసీపీ నేతలకు కామన్‌గా మారింది.
