బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ వారసుడిగా కుమారుడు నిశాంత్ కుమార్ తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నితీష్ కుమార్ స్వయంగా రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నారు. . తన ఆరోగ్యం క్షీణిస్తుండటం, పార్టీపై పట్టు సడలుతుండటంతో, తను యాక్టివ్గా ఉన్నప్పుడే కుమారుడికి రాజకీయ భవిష్యత్తును కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నిశాంత్ కుమార్ను పార్టీలోకి ఆహ్వానించి, రాబోయే కొత్త ప్రభుత్వంలో ఆయనను డిప్యూటీ సీఎంగా చేసేలా బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
బీజేపీ చేతిలోకి ముఖ్యమంత్రి పీఠం?
నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లి, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకోవడంతో, బీహార్ ముఖ్యమంత్రి పదవి ఈసారి బీజేపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా బీహార్ రాజకీయాలను శాసించిన నితీష్, ఇప్పుడు తన పార్టీ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ ఒకవేళ తలుచుకుంటే ఎప్పుడైనా తన పార్టీని చీల్చగలదనే భయం నితీష్లో ఉందని, అందుకే ముందస్తుగానే ఒక సక్సెషన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కుంచించుకుపోతున్న జెడి(యు)
ఒకప్పుడు బీహార్ లో నితీష్ పార్టీ కూటమిలో మేజర్ గా ఉండేది. ఇప్పుడు బీజేపీ మేజర్ గా ఉంది. అయితే ప్రజల్లో నితీష్ కు ఉన్న ఇమేజ్ కారణంగా ఆయననే సీఎంను చేస్తున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించినప్పటికీ, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో పార్టీని కాపాడుకోవాలంటే తదుపరి తరాన్ని సిద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావడం వల్ల క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని, తద్వారా పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని నితీష్ భావిస్తున్నారు.
కేంద్ర రాజకీయాల్లో నితీష్ కొత్త పాత్ర
ఒకటి రెండు నెలల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, నితీష్ కుమార్ ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ అధికార మార్పిడి, బీహార్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపనుంది. నిశాంత్ కుమార్కు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా తన రాజకీయ వారసత్వాన్ని పదిలపరుచుకోవడమే కాకుండా, బీజేపీతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం నితీష్ వ్యూహంలో ప్రధాన భాగం.
