టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు వ్యవహారశైలి ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. సొంత పార్టీ ప్రభుత్వంపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, క్రమశిక్షణ తప్పుతున్న ఆయనపై అధిష్టానం కఠిన వైఖరి అవలంబిస్తోంది. తాజాగా అసెంబ్లీ వేదికగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు చివరి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా కలవడానికి నిరాకరించడంతో, పార్టీ సందేశాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా ద్వారా చేరవేశారు.
తనకు అనుభవం లేకపోవడం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు మార్గదర్శనం చేయాలని కొలికపూడి కోరినట్లు సమాచారం. అయితే, ఇప్పటికే పలుమార్లు పార్టీ సీనియర్లు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆయన తీరులో మార్పు రాకపోవడాన్ని పార్టీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, కేవలం హెచ్చరికలతో ఆయన మారరని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
తిరువూరు నియోజకవర్గ కార్యకర్తలు, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కొలికపూడిపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇకపై ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించడం ఆపేయాలని, తిరువూరుకు తక్షణమే కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు హెచ్చరిక పంపాలని కేడర్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. త్వరలోనే ఆయనపై పార్టీ వేటు వేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.
