జనసేనాని మాట్లాడిన మరో రొటీన్ ప్రెస్ మీట్ ఇది..!

క‌రీంన‌గ‌ర్ లో మీడియాతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై పొగ‌డ్త‌లు కురిపించారు! ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఆయ‌న అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషించార‌న్నారు. ఆయ‌న స్మార్ట్ సీఎం అనీ, అన్నీ బాగానే చేస్తున్నారంటూ మెచ్చుకున్నారు. కొత్త సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం కోస‌మే తాను ఇటీవల కేసీఆర్ ను క‌లిశాన‌న్నారు. దీన్ని ప్ర‌త్యేకంగా చూడాల్సిన అవ‌స‌రం ఏముంద‌నీ, ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా క‌లుసుకోవ‌చ్చ‌ని ప‌వ‌న్ అన్నారు.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ గురించి మాట్లాడుతూ.. ఆంధ్రా, తెలంగాణ‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌న్నారు. అయితే, ఎన్ని సీట్ల‌లో పోటీకి దిగుతామ‌నేది ఇప్ప‌ట్లో చెప్ప‌లేమ‌నీ, ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ఆ నిర్ణ‌యం ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తెలుసుకుంటూ వాటిపై అధ్య‌య‌నం చేస్తున్నామ‌న్నారు. ఏ పార్టీకైనా కొంత స‌మ‌యం ప‌డుతుంద‌నీ, తెరాస‌గానీ టీడీపీగానీ నెమ్మ‌దిగా ఎదిగిన పార్టీలేన‌ని అన్నారు.

సంస్థాగ‌తంగా పార్టీ నిర్మాణం జ‌రుగుతోంద‌నీ, బ‌ల‌మైన సంస్థ కావాలంటే తొంద‌ర‌ప‌డ‌కుండా నిర్మాణం చేసుకోవాల‌న్నారు. త‌న‌కు మొద‌ట్నుంచీ తెలంగాణ అంటే చాలా అభిమానం ఉంద‌నీ, అందుకే ఈ రాష్ట్రం గురించి జ‌న‌సేన పార్టీగా ఏం చేయ‌గ‌ల‌దు అనేది ఆలోచిస్తున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. తెలంగాణ‌పై చాలా అవ‌గాహ‌న ఉన్న‌వారు చాలామంది ఉన్నార‌నీ, అలాంటివారిని చ‌ర్చించి.. ఇక్క‌డ ఏది ఎలా చేయ‌గ‌లం అనేది నిర్ణ‌యిస్తామ‌న్నారు.

త‌న దృష్టిలో రాజ‌కీయాలు అంటే గొడ‌వ‌ల‌కు దిగ‌డం కాద‌నీ, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఏం చేయాల‌నేదే రాజ‌కీయం అన్నారు. ఏదైనా ఒక స‌మ‌స్య తీసుకుంటే.. దానికి ప‌రిష్కార మార్గం చూపి తీరాల‌ని అన్నారు. ఓటు నోటు కేసు వ‌చ్చిన‌ప్పుడు కూడా దానిపై తాను కాస్త సున్నితంగానే స్పందించాన‌నీ, ఎందుకంటే విభ‌జ‌న జ‌రిగిన కొన్నాళ్ల‌కే ఈ స‌మ‌స్య‌పై ఎవ‌రికి న‌చ్చిన‌ట్టుగా వారు మాట్లాడితే స‌మ‌స్య‌లు పెరుగుతాయనే ఉద్దేశంతోనే అప్ప‌ట్లో తాను కొంత ముభావంగా ఉండాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ చెప్పారు. దశాబ్దాల పోరాటం అనంత‌రం తెలంగాణ ఏర్ప‌డింద‌నీ, జిల్లాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ నెల 27 నుంచి అనంత‌పురంలో క‌రువు యాత్ర చేస్తానంటూ ఆంధ్రాలో రాబోయే రోజుల్లో స్పందించ‌బోయే కొన్ని స‌మ‌స్య‌ల గురించి కూడా చెప్పారు.

మొత్తానికి, ప‌వ‌న్ ప్రెస్ మీట్ ఇలా కాస్త రొటీన్ గానే సాగింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా కాస్త అల‌స‌ట‌తో ఉన్న‌ట్టుగా క‌నిపించారు. విలేక‌రుల ప్ర‌శ్న‌ల‌పై గ‌తంలో మాదిరిగా ఆయ‌న ఉత్తేజంగా స్పందించ‌లేదు. ప్ర‌తీ ప్ర‌శ్న‌కూ టూకీగా స‌మాధానం చెప్పేసి తేల్చేయ‌డం గ‌మ‌నార్హం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.