ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామ కృష్ణంరాజు తన పదవికి విరుద్ధంగా రాజకీయ ప్రక్రియల్లో పాల్గొంటున్నారని, నిరంతరం రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. జై భీమ్ రావు భారత్ పార్టీ ప్రతినిధి పి. సురేష్ కుమార్ ఈ అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్, ప్రాథమిక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ లేఖ పంపించారు.
ఫిర్యాదుదారుడి ఆరోపణలు – వరుస ఫిర్యాదులు
తొలుత ఫిర్యాదు చేసినప్పుడు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, సురేష్ కుమార్ రెండోసారి రాష్ట్రపతి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఒక వ్యక్తి స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టిన తర్వాత, వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ఏ పార్టీకి కొమ్ముకాయకూడదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, రఘురామ కృష్ణంరాజు గత కొంతకాలంగా తన నియోజకవర్గంలో, మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో ఎత్తిచూపారు.
డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి
సాధారణంగా శాసనసభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన వారు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. సభలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ, రఘురామ కృష్ణంరాజు ఇటీవల మత మార్పిడులు, ఎస్సీ రిజర్వేషన్లు, ఇతర రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారు. ఈ అంశాలపై వచ్చిన ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకుని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా విచారణకు ఆదేశించడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అలా అయితే తమ్మినేనిపై ఎన్ని చర్యలు తీసుకోవాలి?
రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారన్న కారణంగా చర్యలు తీసుకోవాలి అనుకుంటే.. గతంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారామ్ పై ఎన్ని చర్యలు తీసుకోవాలన్నది అంచనావేయడం కష్టం. ఆయన సభలోనే కాదు బయట కూడా ఎప్పుడూ స్పీకర్ గా వ్యవహరించలేదు. ఘోరమైన బూతులు తిట్టేవారు. తాను సభ జరిగినప్పుడే స్పీకర్ నని.. ముందుగా ఎమ్మెల్యేను అని చెప్పుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడేవారు. ఇప్పుడు రఘురామ రాజకీయాలపై కాకుండా ఇష్యూస్ పైనే మాట్లాడుతున్నారు. మత మార్పిళ్లు, ఆలయం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే ఆయనపై విచిత్రమైన ఫిర్యాదులు చేస్తున్నారు.
