ప్రొ.నాగేశ్వర్ : మధ్యతరగతి ఓట్ల కోసమే పది శాతం రిజర్వేషన్లా..?

ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉభయసభలు ఆమోదించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హఠాత్తుగా ఈ బిల్లును… ముదుకు తెచ్చారు. మంత్రులకు కూడా తెలియనంత సీక్రెట్‌గా ఈ బిల్లును కేబినెట్‌ ముందుకు తెచ్చి ఆమోదించారు. ఇది మంచి నిర్ణయమేనని పార్టీలన్నీ ఆమోదించాయి. అయితే.. రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా… ఓ ఆరోపణ చేశాయి. మోదీ చిత్తశుద్దిని ప్రశ్నించాయి. ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించాయి.

రిజర్వేషన్ల అమలులో ఎదురయ్యే ఇబ్బందుల మాటేమిటి..?

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అనేది చాలా కీలకమైన నిర్ణయం. అయినప్పటికి.. దీన్ని నరేంద్రమోదీ ఆషామాషీగా తీసుకొచ్చారు. ఎక్కడా చర్చ జరగనీయలేదు. ఇలాంటి బిల్లు తీసుకొస్తున్న అనేక అంశాలు… ప్రతిబంధకాలుగా మారుతాయి. రాజకీయ పరమైన.. రాజ్యాంగపరమైన అనేక అనేక సమస్యలు వస్తాయి. బయట ప్రజల్లో, నిపుణుల్లో విస్తృతమైన చర్చ జరిగి ఉంటే.. ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ.. బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నమే చేయలేదు. రేపు పార్లమెంట్ ముగుస్తుందనగా.. ఈ రోజు లోక్‌సభలో బిల్లు పెట్టారు. రాజ్యసభను ఒక్క రోజు పొడిగించి పని పూర్తి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇంత హడావుడిగా చేయడం వల్ల.. ఇప్పుడీ బిల్లు న్యాయపరీక్షకు నిలబడుతుందా లేదా.. అన్నదానిపై.. పార్లమెంట్‌లోనే అనేక సందేహాలు లేవనెత్తారు. దీనికి కేంద్రం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.

దూరమైన అగ్రవర్ణాలను దగ్గర చేసుకునే ప్రయత్నమా..?

పేదలకు ఆదుకోవాలని చిత్తశుద్ధి నిజంగానే కేంద్రానికి ఉంటే.. ఈ బిల్లును.. నాలుగున్నరేళ్ల కాలంలో ఎందుకు తీసుకు రాలేదో… వాళ్లే చెప్పాలి. ఎందుకంటే.. ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్‌లో పాసైపోయినా.. అమలవుతుందో లేదో అన్న అనుమానం రావడానికి… బీజేపీ నేతలే కారణం. ఎందుకంటే… వచ్చేది ఓటాన్ అకౌంట్ పార్లమెంట్ సమావేశాలు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ఉండదు. ఓటాన్ అకౌంట్ ఉంటుంది.. విధానపరమైన నిర్ణయాలేమీ ఆ సమావేశాల్లో తీసుకోరు. ఆ తర్వాత ఎన్నికలొస్తాయి. అంటే.. బిల్లు పాసైపోయినా… అమలు విషయంలో కాస్త గందరగోళంలో ఉన్నట్లే. బీజేపీ హడావుడికి ఇలా చేయడానికి కారణం… కుల రాజకీయాలే. మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో.. తమ బేస్ ఓటు బ్యాంక్‌ను కోల్పోయామని… బీజేపీ భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో ఆ వర్గాలు.. దేశంలో తీవ్రమైన ఆందోళన చేశాయి. దాంతో.. ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో కేంద్రం మార్పులు చేసింది. ఇది… ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంక్‌గా ఉన్న అగ్ర కులాల ఆగ్రహానికి కారణం అయింది. అంతిమంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడానికి కారణం అయింది.

ఎన్నికల జిమ్మిక్‌లా ఎందుకు వాడుకుంటున్నారు..?

దూరమైన … అగ్ర కులాలను… దగ్గర చేసుకోవడంతో పాటు …. పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకూ ఉన్న అగ్రకులాలను ఆకర్షించేందుకు… బీజేపీ ఈ ప్రయత్నం చేసిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రాజకీయ వ్యూహం కాకపోతే… ఈ బిల్లును ఎప్పుడో పార్లమెంంట్ ముందు పెట్టేవారు. నాలుగున్నరేళ్ల పాటు పట్టించుకోకుండా…. ఈ పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు వరకూ… గుంభనంగా.. ఉండి.. చివరి రోజు బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును చట్టాన్ని చేద్దాం అనుకుంటే.. మూడు రాష్ట్రాల ఎన్నికల ముందే చేసేవారు కదా..! అలా చేస్తే.. ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఉపయోగపడేది కదా..! అప్పుడేరాజకీయంగా ఈ బిల్లు ఎంత ఉపయోగకరమో తేలిపోతుంది కదా..!. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా… పటిష్టంగా బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. అలా కాకుండా.. ఓ ఎన్నికల జిమ్మిక్కులా.. ఎందుకు చేస్తున్నారు..?

ఏడాదికి రూ.8 లక్షలు సంపాదిస్తే పేదలు ఎలా అవుతారు..?

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఇది అగ్రకులాల రిజర్వేషన్లుగా ప్రచారం చేస్తున్నారు కానీ.. ఇది అగ్రకులాల రిజర్వేషన్లు కాదు. రూ. 8 లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్న వారందరికీ వర్తింపు చేస్తున్నారు. అంటే.. నెలకు అరవై, డెభ్బై వేలు సంపాదించేవారు కూడా దీనికి అర్హులు. ఇంత సంపాదిచేవారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కాదు. వారు మధ్య తరగతి జీవులు అవుతారు. అందుకే.. మధ్యతరగతి ఓట్లను టార్గెట్ చేసుకుని మోదీ ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ పదిశాతంలో అన్ని కులాలు ఉంటాయి. కానీ.. అమలులో న్యాయపరమైన ఇబ్బందులు ఎలా అధిగమిస్తారన్నది కీలకం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.