టీటీడీ రేసులోకి అనూహ్యంగా వ‌చ్చారీయ‌న‌!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందనే అంశం మీద ఈ మ‌ధ్య‌ చాలా పేర్లే వినిపించాయి. ఓ ద‌శ‌లో హ‌రికృష్ణ‌కు ఇస్తార‌నీ, టీడీపీ నేత ముర‌ళీ మోహ‌న్ కు ఖాయ‌మ‌నీ, త‌న‌కే కావాల‌ని కావూరి సాంబ‌శివ‌రావు చేసిన హ‌డావుడీ.. ఇలా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లే సాగాయి. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఓ పేరు తెర‌మీదికి రావ‌డం విశేషం! ఇంత‌కీ ఆ పేరు ఎవ‌రిదంటే.. సుధాక‌ర్ యాద‌వ్‌! ఈయన ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌, మైదుకూరు ప్రాంతానికి చెందిన టీడీపీ నేత‌. గ‌త ఎన్నిక‌ల్లో మైదుకూరు నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అయితే, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. ఆయ‌నే అనుకోని విధంగా టీటీడీ ఛైర్మ‌న్ రేసులోకి సుధాక‌ర్ యాద‌వ్ ను ఎందుకు తెచ్చిన‌ట్టు..? దీనిక వెన‌క పార్టీ వ్యూహం ఏదైనా ఉందా..? ఇంత‌ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద‌విని పార్టీ ఇస్తామంటున్నా ఆయ‌న సంతృప్తిగా లేరా..? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

సుధాక‌ర్ యాద‌వ్ పేరును తెర‌మీదికి తేవ‌డం వెన‌క అస‌లు కార‌ణం ఇదీ అంటూ ఓ అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే… గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున టిక్కెట్ ద‌క్కించుకుని ఓట‌మి పాల‌య్యాక‌, మ‌ళ్లీ మైదుకూరు నుంచే 2019 ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు సుధాక‌ర్ సిద్ధ‌మౌతూ ఉండటం! అదే ఆశ‌తో మొద‌ట్నుంచీ పార్టీ త‌ర‌ఫున క్రియాశీలంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. మ‌రి, అలాంట‌ప్పుడు ఆయ‌న‌కి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎందుకు ఇస్తున్న‌ట్టు..? అంటే, మ‌రో ప్ర‌ముఖ నేత‌కు లైన్ క్లియ‌ర్ చేయ‌డం కోసం అంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ మ‌రో ముఖ్య నేత ఎవ‌రూ అంటే.. మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి! ఆయ‌న్ని టీడీపీలోకి ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. అయితే, దీనిపై ఇప్ప‌టికిప్పుడు డీఎల్ స్పందించ‌క‌పోయినా.. ఆయ‌న‌కి అవ‌కాశం ఇవ్వ‌డం కోస‌మే సుధాక‌ర్ యాద‌వ్ ను టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వితో సంతృప్తి ప‌ర‌చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

నిజానికి, టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం చాలామంది నేత‌లు చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తున్నారు. అయితే, ఈ ప‌ద‌విపై సుధాక‌ర్ వ‌ర్గం సంతృప్తిగా లేద‌ని తెలుస్తోంది! ఓట‌మి పాలైన ద‌గ్గ‌ర నుంచీ పార్టీకి అండ‌గా ఉంటూ, పార్టీ త‌ర‌ఫున నియోజ‌క వ‌ర్గంలోని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు స‌మీక్షిస్తూ వ‌చ్చి, ఇప్పుడు త‌న‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం స‌రికాద‌నే అభిప్రాయం సుధాక‌ర్ మ‌ద్ద‌తుదారుల నుంచి వ్య‌క్త‌మౌతోంద‌ని అంటున్నారు. 2019లో పార్టీ గెలుపు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి సానుకూల వాతావ‌ర‌ణం తయారు చేసుకుంటే.. ఇప్పుడు మ‌రో పార్టీ నేత‌ను ఆహ్వానించి మైదుకూరులో నిల‌బ‌డితే ఎలా అనే ఆవేద‌న‌తో ఆయ‌న ఉన్నార‌ట‌. పార్టీ సూచించిన‌ట్టు టీటీడీ ప‌ద‌వి ఆయ‌న తీసుకున్నా స‌రే… వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరులో టీడీపీకి అనుకూలంగా ఆయ‌న ప‌నిచేస్తారా అంటే అనుమాన‌మే అని చెప్పొచ్చు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత అనే ఒకే ఒక్క కార‌ణంతో డీఎల్ ను పార్టీలోకి ఆహ్వానించ‌బోతున్న‌ట్టు స‌మాచారం! అదే ప్రాతిప‌దిక అయితే, సుధాక‌ర్ వ‌ర్గం నుంచి డీఎల్ కు సాయం ద‌క్క‌డం అనేది క‌ష్ట‌సాధ్య‌మే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.