ర‌ఘువీరా పిలుపు ఎవ‌రికైనా వినిపిస్తుందా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ.. ఒక‌ప్పుడు ఉండేది అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి! రాష్ట్ర విభ‌జ‌న పుణ్య‌మా అని గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. పోనీ, రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనైనా పుంజుకునే అవ‌కాశం ఉందా… అంటే, క‌చ్చితంగా లేద‌నే అనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లు ప్రధానంగా తెలుగుదేశం వెర్సెస్ వైయ‌స్సార్ సీపీ అన్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అనే మాటే వినిపించ‌డం లేదు. కానీ, ఏపీలో పార్టీ పుంజుకుంటోంద‌నీ, ప్ర‌జ‌లు మ‌ళ్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారంటూ ఈ మ‌ధ్య కొంత‌మంది రాష్ట్ర నేత‌లు అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ద‌గ్గ‌ర నివేదించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, రాష్ట్రంలో కూడా ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి కూడా పోల‌వ‌రం పాద‌యాత్ర అంటూ ఉనికిని చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఓ పిలుపు కూడా ఇచ్చారు. మ‌రి, ఇది ఎంత‌మందికి చేరుతుందో తెలీదుగానీ… ‘కాంగ్రెస్ పార్టీలోకి నాయ‌కుల్ని ఆహ్వానిస్తున్నా’ అని అన్నారు!

ఆయ‌న ఆహ్వానించింది కూడా గ‌తంలో ఆ పార్టీలో ప‌నిచేసిన నేత‌ల్నే! కొన్ని భావోద్వేగాల నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి ఇత‌ర పార్టీలకు కొంత‌మంది కీల‌క నేత‌లు వెళ్లాల్సిన ప‌రిస్థితులు అప్ప‌ట్లో వ‌చ్చాయ‌ని ర‌ఘువీరా తాజాగా అన్నారు. అలా వెళ్లిన‌వారంతా తిరిగి పార్టీలోకి రావాల‌ని సాద‌రంగా ఆహ్వానిస్తున్నాన‌ని ర‌ఘువీరా అన్నారు. ఎవ‌రు వ‌చ్చినా పార్టీ సాద‌రంగా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంద‌నీ, విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే స‌త్తా కాంగ్రెస్ కు మాత్ర‌మే ఉంద‌ని ర‌ఘువీరా చెప్పారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు కాంగ్రెస్ పార్టీ కార‌ణ‌మంటూ కొంత‌మంది అభాండాలు వేసి బ‌య‌ట‌కి వెళ్లిపోయార‌నీ, అలాంటివారంతా తిరిగి సొంత గూడికి నిరభ్యంతరంగా రావొచ్చు అని పిలుపునిచ్చారు.

ర‌ఘువీరా ఆహ్వాన‌ం విన‌డానికి బాగానే ఉంది. కానీ, దీన్ని వినిపించుకునేది ఎవరు…? ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తే.. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాల‌ని ఎవ‌రైనా అనుకుంటారా? కాంగ్రెస్ లో ఉంటే భ‌విష్య‌త్తు బాగుంటుంద‌న్న భ‌రోసా ఎంత‌మందికి ఉంటుంది..? పోనీ, గ‌డ‌చిన మూడున్న‌రేళ్లుగా పార్టీ పున‌రుజ్జీవానికి మిగిలిన ఆ కొద్దిమంది నేత‌లైనా కృషి చేశారా..? ప‌్ర‌త్యేక హోదా, రాజ‌ధాని నిర్వాసితులు, ఆల‌స్య‌మౌతున్న అమ‌రావ‌తి నిర్మాణం, యువ‌త‌కు ఉపాధి.. పోరాడాలంటే ఇలాంటి స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్నాయి. క‌నీసం వీటిల్లో ఒక్క‌దానిపైన అయినా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భావ‌వంతంగా పోరాడిన దాఖ‌లాలు లేవు. అంతెందుకు, వైయ‌స్ రాజశేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి అంతా వైకాపా చేసిందే అన్న‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తుంటే చూస్తున్నారే త‌ప్ప‌… అది త‌మ పార్టీ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి అనేట్టుగా బ‌ల‌మైన స్వ‌రాన్ని వినిపించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి ఎన్నో స‌మ‌స్య‌లున్నాయి. అయినా, ఒక పార్టీలోకి ఒక నాయ‌కుడు వెళ్లి చేరాలంటే స‌ద‌రు పార్టీలో ఏదో ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన అంశం క‌నిపించాలి. అలాంటి ఒక్క పాయింట్ అయినా ఏపీ కాంగ్రెస్ లో క‌నిపించ‌డం లేదు. అలాంట‌ప్పుడు, ర‌ఘువీరా ఆహ్వానించ‌గానే ఎవ‌రు స్పందిస్తారు..? ఇంత‌కీ, ఏ ధీమాతో ర‌ఘువీరా ఈ పిలుపునిచ్చారో మ‌రింత విఫులంగా చెబితే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.