పార్లమెంట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీతో ప్రతి సారి బీజేపీ ఓ ఆట ఆడుకుంటుంది. కానీ ఈ సారి రోల్స్ మారిపోయాయి. బీజేపీతో రాహులే ఆడుకుంటున్నారు. ఆయన లేవనెత్తే అంశాలకు బీజేపీకి వివరణ ఇవ్వడానికే సమయం సరిపోతోంది. పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ గతంలో కంటే భిన్నమైన, అత్యంత దూకుడుగా ఉండే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ దూకుడును ఊహించలేకపోయిన బీజేపీ గట్టిగా సమాధానం ఇవ్వలేకపోతోంది.
నరవణే బుక్ -ఎప్స్టీన్ ఫైల్స్
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకాన్ని సభలో ప్రదర్శించి ఆయన ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అందులో ఉన్న సరిహద్దు భద్రత, అగ్నిపథ్ పథకానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సైనిక విధానాలను మాజీ ఆర్మీ చీఫ్ మాటల ద్వారానే ఎండగట్టడం వల్ల అధికార పక్షం తడబడాల్సి వచ్చింది. అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్‌ను పార్లమెంటుకు తీసుకురావడం ద్వారా రాహుల్ మరో భారీ వివాదాన్ని లేవనెత్తారు. అధికారిక సమాచారాన్ని, అంతర్జాతీయ పరిణామాలను దేశీయ రాజకీయాలకు అనుసంధానిస్తూ కేంద్ర మంత్రులపై ఆరోపణలు సంధించారు. మోదీ పేరు కూడా ప్రస్తావించారు. గతంలో ఇలాంటి అంశాలను బీజేపీ విపక్షాలపై వాడేది, కానీ ఇప్పుడు రాహుల్ అదే శైలిని అనుసరిస్తూ బీజేపీని ఇబ్బంది పెడుతున్నారు. హర్దీప్ పూరి వంటి సీనియర్ మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీనివల్ల చర్చా కార్యక్రమాలు మొత్తం రాహుల్ ఎజెండా చుట్టూనే తిరిగేలా చేయగలిగారు.
అభిశంసన.. అవిశ్వాస తీర్మానం.. ఉక్కిరిబిక్కిరి
రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్షాల ఒత్తిడి ఎంతగా పెరిగిందంటే, చివరికి పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించడానికి సాహసించలేకపోయారు. స్పీకర్ స్వయంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం, విపక్షాల పట్టుబట్టడం వల్ల సభలో ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బీజేపీ తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోంది. గతంలో రాహుల్‌ను తక్కువ అంచనా వేసిన బీజేపీ, ఇప్పుడు ఆయన పార్లమెంటరీ పట్టును చూసి డిఫెన్స్‌లో పడిందని జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా బీజేపీని రాహుల్ మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు.
బీజేపీ వ్యూహాలకు గండి
ఈ సారి పార్లమెంటులో రాహుల్ గాంధీని ఎదుర్కోవడంలో బీజేపీ కేడర్, మంత్రులు తడబడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రాహుల్ చేసే విమర్శలను పప్పు అని కొట్టిపారేసే వారు, ఇప్పుడు ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు లోతైన వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎప్పుడు ఏ పుస్తకాన్ని ప్రదర్శిస్తారో, ఏ అంతర్జాతీయ వివాదాన్ని తెరపైకి తెస్తారోనన్న ఆందోళన అధికార పక్షంలో కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో కేంద్రాన్ని ముప్పుతిప్పలు పెడుతూ, విపక్ష నేతగా తన నాయకత్వ పటిమను రాహుల్ నిరూపించుకుంటున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న అంశాలు.. మంచివో చెడ్డవో కానీ, ప్రభుత్వంపై మాత్రం పైచేయి సాధించగలుగుతున్నారు. ఆయన రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా, బీజేపీకి మాత్రం ఇది ఒక పెద్ద సవాల్‌గా మారింది. సోషల్ మీడియా నుండి పార్లమెంట్ సెంట్రల్ హాల్ వరకు రాహుల్ ఇప్పుడు ప్రధాన చర్చా బిందువుగా మారారు. రాహుల్ అనుసరిస్తున్న ఈ అటాకింగ్ మోడ్ ఢిల్లీ రాజకీయాల్ని కొత్తగా మారుస్తోంది.
