కరీనంగర్ ఎస్సై ఆత్మహత్య ఉదంతం సామాజిక స్పృహను మేల్కొల్పాల్సిన విషాదం. నిజా నిజాలు తెలియకముందే తీర్పులు ఇచ్చే సోషల్ మీడియా ట్రయల్స్ ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకుంటాయనే దానికి ఇది పరాకాష్ట. చట్టాన్ని కాపాడాల్సిన చేతులు.. తన ప్రాణాన్ని తానే తీసుకోవడం వెనుక ఉన్న వేదన వర్ణనాతీతం. ఈ ఆత్మహత్య కారణం.. సోషల్ మీడియా.. ఇతరుల్ని నిందించాలన్న ఆతృతే.
అనుమానించడమే మీడియా, సోషల్ మీడియా పని !
కరీంనగర్ ఎస్సై భార్య అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే, ఆమె మరణానికి కారణం భర్తేనంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం ఒక నిలువెత్తు మనిషిని కుంగదీసింది. కనీసం విచారణ పూర్తి కాకముందే, బాధితుడిని నిందితుడిగా చిత్రీకరిస్తూ సాగిన డిజిటల్ దాడి, చివరికి ఇద్దరు పసిపిల్లలను అనాథలను చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా కీబోర్డ్ మీద చిందులు తొక్కే వేళ్లు, ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయన్నది కఠిన వాస్తవం. దురదృష్టవశాత్తూ నేడు అనుమానించడమే మీడియా అనే ధోరణి పెరిగిపోయింది. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తూ, మసాలా జోడించి కథనాలు వండటం కొన్ని మాధ్యమాలకు అలవాటుగా మారింది.
పోలీసులూ మనుషులేగా!
ఒక వైపు భార్యను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తికి అండగా ఉండాల్సింది పోయి, చుట్టుపక్కల వారు, సోషల్ మీడియా నెటిజన్లు వేలెత్తి చూపడం అతడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తప్పు చేయకపోయినా ఎదుర్కోవాల్సి వస్తున్న అవమానం, సమాజంలో పలచనైపోతున్నామనే ఆందోళన ఆ అధికారిని బలవన్మరణానికి పురికొల్పాయి. ఈ పాపం ఎవరిది? కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిదా? లేక దాన్ని వైరల్ చేసిన సామాన్యులదా? అంటే అందరూ బాధ్యులే.
ఆ కుటుంబం తర్వాత ఇంకో కుటుంబంపై పడతారు – కానీ మారరు!
సెన్సేషన్ కోసం పాకులాడే వెబ్ మీడియా, వ్యూస్ కోసం ఏమైనా చేసే యూట్యూబ్ ఛానెళ్లు నైతికతను మరిచి ప్రవర్తిస్తున్నాయి. ఒక వార్త బయటకు వచ్చినప్పుడు దాని వెనుక ఉన్న యదార్థాన్ని పరిశీలించే ఓపిక ఎవరికీ లేకుండా పోయింది. ఒకరి జీవితం నాశనం అవుతుందనే కనీస ఇంగితం లేకుండా చేసే కామెంట్లే నేడు ప్రాణాంతక ఆయుధాలుగా మారుతున్నాయి. ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట పడాలంటే చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక బాధ్యత పెరగాలి. సోషల్ మీడియాలో బాధ్యతారాహిత్యంగా పోస్టులు పెట్టే వారిపై, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఒక కుటుంబం బలైపోయిన తర్వాత అయ్యో అనడం కంటే, ఆ ప్రమాదం జరగకముందే వాస్తవాలను గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే, మరో కుటుంబాన్ని నాశనం చేయడానికి వేచి చూసే ఈ డిజిటల్ రాబందుల వేట ఆగదు.
