రాజ‌న‌ర్సింహ అసంతృప్తికి అస‌లు కార‌ణ‌మిదేనా..?

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా ఇప్పుడు ఏక‌తాటి మీద ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేశారు. అయితే, ప్ర‌చార ప‌ర్వంలో కొంత‌మందికి ఆశించిన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌న్న అసంతృప్తి పైకి క‌నిపించ‌క‌పోయినా… ఆయా నాయ‌కుల తీరులో అది బ‌య‌ట‌ప‌డుతోంది. ముఖ్యంగా కొంత‌మంది సీనియ‌ర్ల‌లో ఇలాంటి భావ‌న మ‌రింత బ‌లంగా ఉంది. టిక్కెట్ల కేటాయింపు, ప్ర‌చారంలో ముందు వరుస‌లో నిల‌బెట్ట‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు కొంద‌రు సీనియ‌ర్ల‌ను కాస్త అసంతృప్తికి గురి చేస్తున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ తీరుపై పార్టీ వ‌ర్గాలో కొంత చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

నిజానికి, ఈ ఎన్నిక‌ల్లో పార్టీ స్టార్ కేంపెయిన‌ర్ల‌లో రాజ‌న‌ర్సింహ కూడా ఒక‌రు. కాంగ్రెస్ త‌ర‌ఫున రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌ని ఆయ‌నా భావించారు. దానికి అనుగుణంగా స‌భ‌లూ ర్యాలీలు ప్లాన్ చేసుకున్నారు. అయితే, సీట్ల స‌ర్దుబాటు ప్ర‌క్రియ ఎడ‌తెర‌పి లేకుండా సాగుతూ ఆల‌స్యమ‌య్యేస‌రికి… ప్ర‌చార కార్య‌క్ర‌మాల షెడ్యూల్ లో మార్పులు వ‌చ్చేశాయి. ఇక్క‌డే ఆయ‌న కొంత అసంతృప్తికి గుర‌య్యార‌నీ, కీల‌క‌మైన ప్ర‌చార కార్య‌క్ర‌మాలను వాయిదా వేసుకోవ‌డం స‌రికాద‌ని ఎంత చెప్తున్నా… త‌న అభిప్రాయాన్ని పెద్ద‌గా పట్టించుకోలేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌! అయితే, ఆయ‌న అసంతృప్తికి మ‌రో కార‌ణం… తాను కోరినట్టుగా తన వర్గీయులకు టిక్కెట్లు దక్కకపోవడం..! రేవంత్ రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ‌, కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి… వీరు త‌మ వ‌ర్గాల‌కు బాగానే టిక్కెట్లు ఇప్పించుకున్నారనే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో ఉంది. రాజ‌న‌ర్సింహ ఈ విష‌యంలో కూడా అసంతృప్తిగా ఉన్నార‌ట‌.

అందుకే, ఆయ‌న సొంత నియోజ‌క వ‌ర్గానికే ప‌రిమిత‌మౌతున్నార‌ని అంటున్నారు. మేడ్చ‌ల్ లో జ‌రిగిన సోనియా గాంధీ స‌భ‌కు కూడా ఆయ‌న హాజ‌రు కాలేదంటేనే… ఆయ‌న ఎంత గుర్రుగా ఉన్నార‌నేది అర్థం చేసుకోవ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అంతేకాదు, మేనిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్ ఆయ‌నే… కానీ, పార్టీ మేనిఫెస్టో విడుద‌ల కార్య‌క్ర‌మానికి కూడా రాలేదు. అయితే, ప్రచార కార్య‌క్ర‌మంలో బాగా బిజీగా ఉండ‌టంతోనే ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌న‌ర్సింహ రాలేదంటూ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కొంత క‌వ‌రింగ్ చేస్తున్నారు. సోనియా స‌భ‌, మేనిఫెస్టో విడుద‌ల కంటే సొంత నియోజ‌క వ‌ర్గంలో పెద్ద ప్ర‌చార‌మంటూ ఏముంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.