వైసీపీ నేతలంటే చెవుల్లో నుంచి రక్తం కారేలా మాట్లాడటంలో ప్రసిద్ధులు. అధికారంలో ఉన్నప్పుడు .. ల భాష వాడటంలో డిగ్రీలు, పీహెచ్డీలు చేశారు. వారి భాష విని విని ప్రజలకు చిరాకేసింది. వారిని దరిదాపుల్లోకి రాకుండా ఓడించారు. అయితే వారికి భయం అనేది కలగలేదు. ప్రజల్ని వారు లెక్కలోకి తీసుకునేది తక్కువ. ఓడిపోయారు కాబట్టి ..పోలీసు కేసుల భయంతో కొంత కాలం సైలెంటుగా ఉందామని అనుకున్నారు. మాటల పరంగా సైలెంటుగా ఉన్నా.. చేతల్లో దారుణాలు చేయడంతో వంశీ జైలుకెళ్లాడు. కొడాలి నాని హార్టులో హోల్ అని చెప్పి సైలెంటుగా ఉన్నారు. వీరితో పాటు మరో వైసీపీ మరో స్టార్ కామేంటటర్ రోజా కూడా కొన్నాళ్లు సైలెంటుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె వారిద్దరి కంటే ముందే దూసుకొస్తున్నారు.
తన భాషలోకి వచ్చేస్తున్న రోజా !
చాలా రోజులుగా సైలెంటుగా ఉన్న రోజా మంగళవారం తన భాషలోకి వచ్చేశారు. పోలీసుల్ని నీళ్లు లేని బావిలోకి దూకాలనడం దగ్గర నుంచి చంద్రబాబును గాడు అని సంబోధించడం, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వరకూ అన్నీ చేశారు. రోజా మాట్లాడే మాటల కన్నా ఆమె చూపించే హావభావాలు చూసిన వారికి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారేంటి అని అనిపిస్తుంది. మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇలాంటి మాటలు మాట్లాడారని అనుకున్నారు. కానీ ఆమె సహజశైలి అంతే అన్నట్లుగా ఇప్పుడు మరోసారి రెచ్చిపోతున్నారు. అసభ్య వ్యాఖ్యలతో తనదైన మార్క్ చూపించేందుకు రంగంలోకి దిగుతున్నారు.
ఎంత అవినీతి చేసినా పట్టించుకోవడంలేదనే ధీమా!
రోజా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి గురించి ప్రభుత్వం వద్ద సంపూర్ణమైన సమాచారం ఉంది. తిరుమల టిక్కెట్లను అమ్ముకున్న వైనం దగ్గర నుంచి .. మంత్రిగా తన శాఖలో ఆడుదాం.. ఆంధ్రా పేరుతో సంపాదించుకున్న సొమ్ముల వరకూ అన్నీ లెక్కలు తీసి పెట్టారు. విజిలెన్స్ రిపోర్టు డీజీపీ వద్దకు చేరిందని ఎప్పుడో సమాచారం లీక్ చేశారు. కానీ ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. రోజా విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలస్యం కారణంగానే ఆమె రెచ్చిపోతున్నారు. ఎంత రాజకీయ అవినీతికి పాల్పడ్డ… మహిళా నేతలను అరెస్టు చేయవద్దని చంద్రబాబు చెప్పారని ఓ సందర్భంలో పేర్ని నాని మీడియాకు చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే అదే నిజం అనిపిస్తోంది. అందుకే రోజా.. మరింత రెచ్చిపోతున్నారు.
ఇక కొడాలి, నాని కూడా వచ్చేస్తారు!?
రోజా ఇలా రెచ్చిపోయి… అధికారంలో ఉన్నవారిని కూడా బూతులు తిట్టి హాయిగా జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆనందం కల్పించి ..తమ సీటును కాపాడుకూంటూంేట.. కొడాలి నాని, వంశీ సైలెంటుగా ఉండే అవకాశం లేదు. వారు కూడా నాలుక సవరించుకుని ల భాషతో మళ్లీ సాక్షి మీడియాలో ప్రవచనాలు వినిపించేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. అధికారంలో ఉండి రప్పారప్పా హెచ్చరికలు చేస్తున్న వారికి గట్టి ట్రీట్ మెంట్ ఇవ్వలేకపోతున్నారన్న విమర్శలు కూటమి ప్రభుత్వంపై ఉన్నాయి. ఇప్పుడు ఈ నేతలు తిట్ల దండకాలు అందుకున్నా.. ఏమీ చర్యలు ప్రారంభం కాకపోతే.. ఇబ్బందికరమే అని టీడీపీ క్యాడర్ నిట్టూరుస్తున్నారు.
