ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని ప్రజలు తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సలహాలిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో విచారణకు కేటీఆర్ విచారణకు వెళ్లిన సమయంలో పోలీసు అధికారి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయన ప్రెస్మీట్ పెట్టి ఆ పని నేరం కాదని చెప్పడం వ్యూహాత్మకమే అనుకోవచ్చు. ట్యాపింగ్ చేసినట్లుగా ఆధారాలన్నీ పోలీసులు ముందు పెట్టి ప్రశ్నిస్తారని క్లారిటీ రావడంతో బీఆర్ఎస్ ఈ ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాప్ చేయడం సాధారణమేనని.. ఈ విషయం చట్టంలో కూడా ఉందన్నారు. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాప్ చేస్తున్నామని గతంలో ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ కూడా చెప్పారని ప్రవీణ్ వాదిస్తున్నారు. ఆయన చెప్పింది నిజమే కావొచ్చు కానీ.. ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ అవసరాల కోసం.. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచడానికి, పారిశ్రామిక వేత్తల గుట్టు తెలుసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ట్యాపింగ్ చేయడం మాత్రం ఘోరమైన నేరం.
ఎవరో ఏమో కానీ స్వయంగా ప్రవీణ్కుమారే తాను బీఎస్పీలో ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెట్టారు. అప్పుడే ట్యాప్ చేసుకోవచ్చునని చట్టం అనుమతిస్తుందని ఆయన ఒప్పుకుని ఉండాల్సింది. తెలంగాణలో పది సంవత్సరాల కాలంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ పరిమితులు దాటిపోయింది. చివరికి సొంత కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టారని తేలుతోంది. ఇదే అత్యంత ఘోరమైన అంశం. ఇప్పుడు ఎన్ని వాదనలు చేసినా.. ట్యాపింగ్ నేరం కాదని.. జనరలైజ్ చేసే ప్రయత్నం చేసినా.. నేరం కాకుండా పోదని అనుకోవచ్చు.
