వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అమరావతికి బదులుగా తెరపైకి తెచ్చిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. ఈ వింత పేరు, విచిత్రమైన ఐడియా వెనుక ఉన్న అసలు మేధావి ఎవరా అని అందరూ ఆరా తీస్తుంటే.. అందరి చూపు సహజంగానే పార్టీ పెద్ద సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు మళ్లింది. దీంతో ఈ మావిగన్ పాపం ఎక్కడ తన చుట్టుకుంటుందో అని సజ్జల తెగ టెన్షన్ పడిపోతున్నారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో సజ్జల తీరు చూస్తుంటే.. ఆ ఐడియా నాది కాదు బాబోయ్ అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. మావిగన్ గురించి విలేకరులు ప్రశ్నిస్తుంటే, ఆ పేరు ఎత్తడానికే ఆయన ఇష్టపడలేదు. పైగా, జగన్ గారు ఎవరి సలహాలైనా తీసుకుంటారా? ఆయనకు ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వగలరా అంటూ ఎదురు దాడికి దిగారు. అంటే, జగన్ గారు తనంతట తానుగా తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం ఇదని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని సున్నితంగా పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశారన్నమాట.
నిజానికి సజ్జల బాధ కూడా అర్థం చేసుకోదగ్గదే. గతంలో మూడు రాజధానుల ముచ్చట చెప్పి ఇప్పుడు దాన్ని అటకెక్కించి, కొత్తగా ఈ మావిగన్ గోల ఏంటని జనం నవ్వుకుంటుంటే.. ఆ క్రెడిట్ మొత్తం తన అకౌంట్లో పడిపోతుందని ఆయన భయం. అందుకే, జగన్ ని ఒక తిరుగులేని నాయకుడిగా చూపిస్తూనే, ఆ మావిగన్ సలహాదారు బాధ్యత నుంచి తన పేరును రక్షించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు.
అమరావతికి అడ్డుకట్ట వేయడానికి తెచ్చిన ఈ మావిగన్ ఐడియా ఇప్పుడు వైసీపీలో చిచ్చు పెడుతోంది. సలహా ఇచ్చింది సజ్జలా లేక జగన్ స్వయంగా కనిపెట్టారా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ పేరు విన్నప్పుడల్లా జనానికి మాత్రం గన్ లాంటి సెటైర్లు గుర్తొస్తున్నాయి. మొత్తానికి సజ్జల మాత్రం తన సలహాదారు ముద్రను ఈ విషయంలో చెరిపేసుకోవడానికి గట్టిగానే చెమటోడుస్తున్నారు.
