“జగన్ నిజాయితీ”ని సాక్షి ఎందుకు దాచి పెడుతోంది..?

“కాపు రిజర్వేషన్లపై నేనేమీ చేయలేను. అది కేంద్రం చేతుల్లో ఉంది..” అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి… జగ్గంపేట… నిస్సంకోచంగా ప్రకటించారు. అది ఓ రకంగా ఆయన నిజాయితీ ప్రదర్శన. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వలేనని.. చెప్పేందుకు ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆ తర్వాత కాపుల్ని ఆకట్టుకునేందుకు చాలా కబుర్లు చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ సాక్షి దినపత్రిక మాత్రం.. జగన్ నిజాయితీ ప్రదర్శనను అడ్డగోలుగా సెన్సార్ చేసింది. అసలు విషయాన్ని వదిలేసి… జగన్ ఏం చెప్పాడో పాఠకులకు అర్థం కాకుండా ప్రచురించింది. సూటిగా, సుత్తిగా లేకుండా జగన్ చెప్పిన అంశాన్ని.. సాక్షి పత్రిక… అందుకు పూర్తి భిన్నంగా ప్రజల ముందు ఉంచింది.

జగ్గంపేటలో జగన్ చేసిన ప్రకటనలో ప్రజలకు నేరుగా చెప్పాల్సిన ఒకే ఒక్క అంశం… “కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను” అని జగన్ చెప్పడం. జగన్ కూడా ప్రజలకు ఇదే చెప్పాలనుకున్నారు. మరి సాక్షి పత్రిక మొదటి పేజీలో … అలాంటి వాక్యాన్నే లేకుండా ఎందుకు చేసింది..? జగన్… ఇచ్చిన సందేశాన్ని సాక్షి ఎందుకు పరిమితం చేసిందన్నది పాఠకులకు అర్థం కావడం లేదు. జగన్ అంత డేర్‌గా చెప్పిన మాటలు కూడా.. రాజకీయంగా ఆయనకు కీడు చేస్తాయని సాక్షి ఎడిటోరియల్ సిబ్బంది ఫీల్ అయ్యారా..? జగన్ రాజకీయ భవిష్యత్‌పై… ఆయన కంటే ఎక్కువగా సాక్షి ఎడిటోరియల్ స్టాఫే బాధ్యతగా ఫీలవుతున్నారా..? కాపు రిజర్వేషన్లను ఇవ్వలేనని రాజకీయంగా ఇబ్బందికరమైతే జగన్మోహన్ రెడ్డినే పరోక్ష ప్రకటన చేసి ఉండేవారు. రాజకీయాల్లో అది సహజం. ఆ విషయంలో సలహాలివ్వడానికి జగన్మోహన్ రెడ్డికి చాలా మంది ఉంటారు. అత్యంత ప్రభావం చూపుతున్న సమస్యపై ఎంతో కొంత కసరత్తు చేసే జగన్ ఈ ప్రకటన చేసి ఉంటారు. మరి సాక్షి దీన్ని ఎందుకు వేరే అర్థాన్ని పాఠకులకు పంపాలని అనుకుంది..?

రాజకీయ నాయకుల నోటి నుంచి.. నేను చేయలేను అనే మాట రావడం అరుదు. అలా వచ్చిందంటే.. ఆయన చేతకానితనం ప్రజల్లోకి వెళ్లిపోతుంది. అసాధ్యం అని తెలిసి కూడా… కొన్ని కొన్ని సందర్భాల్లో.. ప్రయత్నిస్తామని చెప్పుకుంటారు కానీ… చేయలేము అని ఏ రాజకీయ నేతా చెప్పడు. కానీ జగన్మోహన్ రెడ్డి… ఈ విషయంలో దాపరికాలు ఉంచుకోలేదు. అందుకే నేరుగా జగన్ ప్రకటనను ప్రజల్లోకి పంపితే.. ఆయన చేతులెత్తేసినట్లు అందరూ అనుకుంటారని సాక్షి ఎడిటోరియల్ సిబ్బంది భావించినట్లు ఉన్నారు.

సాక్షి దినపత్రికలో ఇప్పటి వరకూ ఓ రకమైన పోకడ కనిపించింది. వైసీపీకి రాజకీయంగా పనికొచ్చే వార్తలు, ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వడం… జగన్ ప్రకటనలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటి వరకూ కనిపించేది. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్న ప్రసంగాల్లోని ముఖ్యమైన అంశాలను… కూడా… ఆయనకు రాజకీయంగా నష్టం రాకుండా.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్తగా పాట్లు పడేందుకు సాక్షి ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో పాఠకులను పూర్తి స్థాయిలో కన్ఫ్యూజ్ చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com