సంక్రాంతికి మించిన సీజన్ టాలీవుడ్ కి దొరకదు. ఓ యావరేజ్ సినిమాని కూడా హిట్ చేసే దమ్మున్న సీజన్ ఇది. మామూలు సీజన్లో విడుదల చేస్తే వచ్చే కలక్షన్ కంటే, సంక్రాంతికి వచ్చే సినిమాల వసూళ్లు డబుల్ ఉంటాయి. అందుకే సంక్రాంతిపై గురి పెడుతుంటారు నిర్మాతలు. 2026 సంక్రాంతికి అప్పుడే బెర్తులు నిండుకొన్నాయి. వచ్చే సీజన్లో 4 సినిమాలు రాబోతున్నాయి. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా సంక్రాంతికి రావడం పక్కా అయినట్టే. నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ సినిమానీ సంక్రాంతినే టార్గెట్ చేసుకొని రెడీ చేస్తున్నారు.
రవితేజ – కిషోర్ తిరుమల కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమానీ 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అంటే ఇప్పటికి మూడు సినిమాలు వస్తున్నాయన్నమాట. తమిళం నుంచి విజయ్ సినిమా ఒకటి ఈ పండక్కే విడుదల కానుంది. అంటే మొత్తంగా కలిపి నాలుగు సినిమాలయ్యాయి. మున్ముందు ఇంకెన్ని సినిమాలు రేసులో ఉంటాయో తెలియడం లేదు. ఎలా చూసినా 4-5 సినిమాలు రావడం గ్యారెంటీ. సంక్రాంతి కాబట్టి ఎన్ని సినిమాలొచ్చినా.. ఛాన్స్ ఉంటుంది. కాకపోతే బడా స్టార్ సినిమా అంటే అది చిరు – అనిల్ కాంబోనే. చిరు సినిమాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. మరో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. రవితేజ సినిమా ఈమధ్యే పట్టాలెక్కింది. నవీన్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.