మంజునాధ వ్యాఖ్య వెనుక వ్యూహ‌మేమిటి?

మంజునాధ క‌మిష‌న్ ఛైర్మ‌న్ జ‌స్టిస్ మంజునాథ ఈరోజు చేసిన వ్యాఖ్య ఆస‌క్తిక‌రంగానూ.. అనుమానాల‌ను రేకెత్తించేదిగానూ ఉంది. ఈ నెల 26నుంచి కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. అమ‌రావ‌తికి చేప‌ట్ట‌నున్ననిర‌వ‌ధిక పాదయాత్ర నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య చేశారు. త‌మ క‌మిష‌న్‌కు కాపు రిజ‌ర్వేష‌న్ల‌తో ఏమాత్రం సంబంధం లేద‌న్న‌ది ఆయ‌న వ్యాఖ్య‌.. 62 కులాలను బీసీల్లో చేర్చే అంశాన్ని ప‌రిశీలించ‌డ‌మే త‌మ ప‌న‌నీ, 31 కులాలు త‌మ క్యాట‌గిరి మార్చాల‌ని కోరాయ‌నీ ఆయ‌న అంటున్నారు. క‌మిష‌న్ నివేదిక వ‌చ్చిన త‌ర‌వాత రిజ‌ర్వేష‌న్ల సంగ‌తి చూస్తామ‌ని ఇంత‌వ‌ర‌కూ చెప్పుకుంటూ వ‌చ్చిన ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడేం చెబుతున్న‌ది మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌ప్పించుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ప్పుడు ప్ర‌త్య‌ర్థిని క‌న్ఫ్యూజ్ చేసేసి, బ‌య‌ట ప‌డ‌డం ప్ర‌భుత్వాలు చేస్తూ వ‌స్తున్నాయి. టీడీపీ ప్ర‌భుత్వానికి ఇది వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇంత‌వ‌ర‌కూ కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి ముద్ర‌గ‌డ చేసిన దీక్ష‌ల‌ను, యాత్ర‌ల‌ను త‌న చ‌తుర‌త‌తో ఎదుర్కొన్న చంద్ర‌బాబు స‌ర్కారు తాజా ఉద్య‌మాన్ని ఎదుర్కొన‌డానికి ఏం చేయ‌బోతోందో క‌మిష‌న్ తాజా వ్యాఖ్య తేట‌తెల్లం చేస్తోంది. వాస్త‌వానికి ఇది కాపు వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేదే. ఈ క్ర‌మంలో వారేమైనా ఆందోళ‌న‌కు దిగితే, శాంతిభ‌ద్ర‌త‌ల బూచిని చూపించి, ముద్ర‌డ‌గ యాత్ర‌ను అడ్డుకోవ‌డం ఒక వ్యూహం కావ‌చ్చు. తాజా ప‌రిణామాల్లో టీడీపీ తేజ‌స్సు త‌గ్గుతోంది. ఆ విష‌యం పార్టీ అధినేత‌కూ అర్థ‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెగ్గాలంటే మ‌ళ్లీ ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. అందులో ప్ర‌తిప‌క్షాన్ని నిర్వీర్యం చేయ‌డం ఒక‌టి. టీడీపీ గెలుపున‌కు ముద్ర‌గ‌డ రూపంలోనే అడ్డంకి ఎదుర‌వుతుంద‌నేది నిస్సందేహం. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త పార్టీ ఓట‌మికే దారితీస్తుంది. ఇది చ‌రిత్ర చెబుతున్న న‌గ్న‌స‌త్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.