“మనం మన పిల్లల బాల్యాన్ని ప్లే-బేస్డ్ నుండి ఫోన్-బేస్డ్ గా మార్చేశాం. ఇది మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రయోగం. దీని ఫలితంగానే నేటి యువతలో గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళన, కుంగుబాటు పెరిగిపోయాయి.” ..
ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మనస్తత్వవేత్త జోనాథన్ హైడ్ వ్యక్తం చేసిన ఆందోళన ఇది. పెరుగుతున్న సాంకేతికత ఖచ్చితంగా మానవజీవితాల్లో పెనుమార్పులు తెస్తోంది. అది మంచి చేస్తోందా.. చెడు చేస్తోందా అన్న చర్చకు అంతం ఉండదు కానీ పిల్లల విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో చెడు చేస్తోందన్న మాటే వినిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టాలు తెచ్చాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలు అదే ఆలోచన చేస్తున్నాయి.
పిల్లలకు సోషల్ మీడియా ఓ డిజిటల్ డ్రగ్
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, యువ జనాభానే మన అతిపెద్ద ఆస్తి. కానీ, దురదృష్టవశాత్తు నేటి తరం బాల్యం మైదానాల్లో కాకుండా మొబైల్ స్క్రీన్ల మధ్య బందీ అవుతోంది. సోషల్ మీడియా అల్గారిథమ్‌లు పిల్లల మెదడులను నియంత్రిస్తూ, వారి సహజసిద్ధమైన ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యా వ్యవస్థ , సామాజిక పరిస్థితుల దృష్ట్యా, పిల్లలకు సోషల్ మీడియాపై పరిమితులు విధించడం ఇప్పుడు అత్యవసరం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ అంశంలో మొదటి సారిగా గట్టిగా స్పందించారు. దావోస్‌లో ఆయన పదహారేళ్ల పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు. ఆ దిశగా కసరత్తు కూడా చేస్తున్నారు. పిల్లలకుసోషల్ మీడియా ఖచ్చితంగా వినాశకరం.. కానీ నిషేధం పరిష్కారమా అంటేనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
“సోషల్ మీడియా అనేది నేటి తరం పిల్లల పాలిట డిజిటల్ డ్రగ్ . ఇది వారి మెదడులోని డోపమైన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. నిజమైన విజయం కోసం ఉండాల్సిన ఓర్పును ఇది చంపేసి, కేవలం క్షణికానందం కోసమే బతికేలా వారిని మారుస్తుంది.” అని ప్రముఖ ఇన్వెస్టర్ , ఫిలాసఫర్ నవల్ రవికాంత్ చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. పిల్లల మెదడు అభివృద్ధి చెందే దశలో సోషల్ మీడియా అందించే ఇన్స్టంట్ డోపమైన్ అంటే తక్షణ ఆనందం వారికి వ్యసనంగా మారుతోంది. లైక్‌లు, వ్యూస్ కోసం పాకులాడటం వల్ల చిన్న వయసులోనే ఆందోళన , కుంగుబాటు , ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతున్నాయి. ఇతరుల కృత్రిమ జీవితాలతో తమను తాము పోల్చుకుంటూ, పిల్లలు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. సైబర్ బుల్లీయింగ్ , ఆన్లైన్ వేధింపులు పిల్లలను ఆత్మహత్యల వరకు తీసుకువెళ్తున్న ఘటనలు భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. భారతీయ విద్యా వ్యవస్థ అత్యంత పోటీతో కూడుకున్నది. విద్యార్థులకు ఏకాగ్రత , లోతైన అధ్యయనం చాలా ముఖ్యం. అయితే రీల్స్, షార్ట్స్ సంస్కృతి వల్ల పిల్లల అటెన్షన్ స్పాన్ నిమిషాల నుంచి సెకన్లకు పడిపోయింది. గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గడమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలు నశిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తి, అది వారి విద్యా సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. భారతదేశం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు, సామాజిక సంబంధాలకు పెట్టింది పేరు. కానీ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఒకే ఇంట్లో ఉంటూనే ఏకాకులుగా మారుతున్నారు. ప్రత్యక్ష సంభాషణలు తగ్గి, ఎమోజీల ద్వారా భావాలను పంచుకోవడం వల్ల వారిలో సామాజిక నైపుణ్యాలు, సానుభూతి లోపిస్తున్నాయి. ఇంటర్నెట్లో లభించే అనవసరమైన, కొన్నిసార్లు అశ్లీలమైన సమాచారం వారి ప్రవర్తనను తప్పుదోవ పట్టిస్తోంది. విలువలతో కూడిన విద్యకు బదులు, సోషల్ మీడియా ట్రెండ్స్‌ను అనుసరించడమే జీవితం అనుకునే భ్రమలో వారు బతుకుతున్నారు. ఇలాంటి మార్పులకు ప్రతీ రోజూ మనకు ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల విజయవాడ నుంచి ఓ స్కూల్ స్థాయి దాటని పిల్లలు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసి ఇల్లు అద్దెకు తీసుకుని బతికేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి బయటకు రావిని ఎన్నో. ఇవన్నీ సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్స్ కాదని ఎవరూ చెప్పలేరు.
మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పిల్లలకు సోషల్ మీడియాతోనే స్నేహం
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక అవసరాల దృష్ట్యా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు పనులు, ప్రయాణాలతోనే సమయం సరిపోతుండటంతో, పిల్లలతో గడిపే క్వాలిటీ టైమ్ క్రమంగా కరువవుతోంది. ఒకప్పుడు తాతయ్యలు, నానమ్మల నీడలో సాగే బాల్యం.. ఇప్పుడు కేవలం నలుగురు గోడల మధ్య లేదా డే-కేర్ సెంటర్ల పరిమితులకు లోనవుతోంది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ, ఆప్యాయత దొరకని సమయంలో ఏర్పడే ఆ ఖాళీని పూడ్చుకోవడానికి పిల్లలు డిజిటల్ తెరలను ఆశ్రయిస్తున్నారు. తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్ పిల్లలను డిజిటల్ అనాథలగా మారుస్తోంది. తమకు సమయం దొరకని తరుణంలో పిల్లలను నిశ్శబ్దంగా ఉంచడానికి తల్లిదండ్రులు స్వయంగా మొబైల్ ఫోన్లను వారి చేతికి ఇస్తున్నారు. ఇది క్రమంగా సోషల్ మీడియా వ్యసనానికి దారితీస్తోంది. సామాజిక మాధ్యమాలు అందించే కృత్రిమ ప్రపంచం పిల్లల ఒంటరితనాన్ని తాత్కాలికంగా పోగొట్టినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో అది వారిలో మానసిక ఒత్తిడిని, ఏకాగ్రత లోపాన్ని పెంచుతోంది. ప్రత్యక్ష సంభాషణలు లేని ఇంట్లో, సోషల్ మీడియా అల్గారిథమ్‌లే పిల్లల ఆలోచనా విధానాన్ని నిర్దేశిస్తుండటం సమాజానికి ఒక హెచ్చరిక. సంపాదన కుటుంబ అవసరాలను తీర్చవచ్చు కానీ, అది పిల్లలకు ఇచ్చే సంస్కారాన్ని, సమయాన్ని భర్తీ చేయలేదు. నా మేనల్లుడు సోషల్ మీడియాను వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే టెక్నాలజీ అనేది మానవత్వాన్ని పెంపొందించాలి కానీ, మనుషులను ఏకాకులను చేయకూడదు. పిల్లల అమాయకత్వాన్ని సోషల్ మీడియా అల్గారిథమ్స్ తమ లాభం కోసం వాడుకుంటున్నాయి..అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పిన మాటలు అక్షర సత్యం.
నిషేధం విధిస్తే సమస్య పరిష్కారం అవుతుందా !?
ఈ సమస్య అత్యంత తీవ్రమైనది. భావితరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. మరి నిషేధం విధిస్తే సమస్య పరిష్కారం అవుతుందా?. ప్రపంచంలో నిషేధం అనేది ఏ విషయంలో ఎక్కడా విజయవంతమైన దాఖలాలు లేవు. సామాజిక సమస్యల పరిష్కారానికి నిషేధం అనేది ఎప్పుడూ ఒక సులభమైన దారిగా కనిపిస్తుంది కానీ, అది శాశ్వత పరిష్కారాన్ని చూపలేదు. మన దేశంలో మద్యం, గుట్కా నుంచి అశ్లీల వెబ్ సైట్ల వరకు మనం అనేక వాటిపై నిషేధాలు విధించాం. అయితే, ఈ నిషేధాలు ఏవీ క్షేత్రస్థాయిలో ఆయా వస్తువుల లభ్యతను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. చట్టాల కళ్లు గప్పి ప్రత్యామ్నాయ మార్గాల్లో, మరింత ప్రమాదకరమైన రీతిలో అవి సమాజంలోకి చొచ్చుకొస్తున్నాయి. కేవలం నిషేధం విధించగానే ఒక సమస్య అంతరించిపోతుందని భావించడం అమాయకత్వమే అవుతుంది.
సోషల్ మీడియాను నిషేధించడం అనేది భౌతిక వస్తువులను నిషేధించినంత సులభం కాదు. నేటి గ్లోబల్ డిజిటల్ యుగంలో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వంటి సాంకేతికతలు సరిహద్దులను చెరిపివేస్తున్నాయి. అధికారికంగా ఒక యాప్ లేదా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసినా, యువత ఇతర మార్గాల ద్వారా వాటిని యాక్సెస్ చేసే అవకాశం ఉంది.
ఏది వద్దంటే అదే కావాలనుకునే పిల్లల మనస్థత్వాన్ని డీల్ చేయడం కష్టం !
అదే సమయంలో మన పిల్లల మనస్తత్వాన్ని, తల్లిదండ్రుల అవగాహన స్థాయిని కూడా మనం ఓ సారి విశ్లేషించాలి. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి నుంచి కొన్ని అలవాట్లను చెప్పి వాటి జోలికి పోవద్దు.. అని హెచ్చరిస్తూ ఉంటారు . ఉదాహరణ.. మద్యం, సిగరెట్లు, సినిమాలు. ఇలా చెప్పడం వల్ల పిల్లల్లో వాటిల్లో ఏదో ఉందన్న క్యూరియాసిటీని పెంచుకుంటారు. మొదటగా దొంగచాటుగా రుచి చూస్తారు. తర్వాత అలవాటుగా మార్చుకుంటారు.. చివరికి వ్యసనంగా మార్చుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఆ కోవలోకి చేరుతుంది. పిల్లలకు ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే.. అంతగా వారికి క్యూరియాసిటీ పెరుగుతుంది. మానవ మనస్తత్వశాస్త్రంలో రియాక్టెన్స్ థియరీ ప్రకారం, ఒక వ్యక్తికి స్వేచ్ఛను హరిస్తున్నారని లేదా ఒక విషయాన్ని తీవ్రంగా నిరోధిస్తున్నారని అనిపించినప్పుడు, ఆ విషయంపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. తరతరాలుగా భారతీయ తల్లిదండ్రులు మద్యం, ధూమపానం లేదా ఇతర వ్యసనాలపై విధిస్తున్న ఆంక్షలు పిల్లల్లో ఒక రకమైన నిషిద్ధ ఆకర్షణ ను కలిగిస్తున్నాయి. వాటి జోలికి వెళ్లొద్దు అని హెచ్చరించినప్పుడల్లా, అందులో అంతగా ఏముంది? అనే కుతూహలం పిల్లల మెదళ్లలో బలంగా నాటుకుపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో కూడా ఇదే తరహా ప్రమాదం పొంచి ఉంది. సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించి, పిల్లల నుంచి దానిని దూరం చేస్తే.. వారు ఆ డిజిటల్ ప్రపంచాన్ని ఒక రహస్య సాహసం గా భావించే అవకాశం ఉంది. పెద్దలకు తెలియకుండా నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడం, అపరిచితులతో స్నేహం చేయడం వంటి ప్రమాదకర మార్గాల్లోకి వారు వెళ్లే ప్రమాదం ఉంది. ఎంతగా అణిచివేస్తే అంతగా విస్ఫోటనం చెందే గుణం కలిగిన టీనేజ్ మనస్తత్వం.. ఈ ఆంక్షలను ధిక్కరించడంలోనే ఒక రకమైన తృప్తిని వెతుక్కుంటుంది. ఫలితంగా, నిషేధం వల్ల మనం ఆశించే రక్షణ కంటే, దొంగచాటు వ్యవహారాల వల్ల కలిగే నష్టమే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నిషేధం అంటే ఓ పక్కా ప్రణాళిక !
ఆస్ట్రేలియా వంటి దేశాలు సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నాయంటే, ఆ నిర్ణయం వెనుక కేవలం ఒక చట్టం మాత్రమే లేదు; దాన్ని పక్కాగా అమలు చేసే సాంకేతిక సామర్థ్యం , పౌరుల్లో ఉన్న సామాజిక బాధ్యత కూడా తోడవుతాయి. ఆయా దేశాల్లో విద్యా వ్యవస్థలు విద్యార్థుల మానసిక వికాసంపై నిరంతరం పని చేస్తూ, వారిలో వివేచనా శక్తిని పెంచేందుకు భారీగా నిధులను, వనరులను కేటాయిస్తాయి. ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి కఠిన నిర్ణయాలకు ఊతంగా అక్కడ పాఠశాల స్థాయి నుంచే కౌన్సిలింగ్ వ్యవస్థలు, మానసిక నిపుణుల పర్యవేక్షణ అత్యంత పటిష్టంగా ఉంటాయి. అంటే, వారు నిషేధాన్ని ఒక ముగింపుగా కాకుండా, ఒక సమగ్రమైన సామాజిక సంస్కరణలో భాగంగా మాత్రమే చూస్తారు. మౌలిక సదుపాయాలు , విద్యా విలువల విషయంలో ఆ దేశాలతో పోలిస్తే మన పరిస్థితి భిన్నంగా ఉంది. మన దేశంలో ఒక చట్టాన్ని తీసుకురావడం సులభమే కానీ, దాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న లొసుగులను అరికడుతూ అమలు చేయడం ఒక సవాలు. అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిణతి చెందిన విద్యా వ్యవస్థలు , విద్యార్థుల మానసిక స్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం వారిని అనుకరిస్తూ ఇక్కడ నిషేధాలు విధిస్తే అది ప్రయత్నం చేశామని చెప్పుకోవడానికి మాత్రమే పనికివస్తుంది. మన దేశంలో పిల్లల సహజమైన కుతూహలాన్ని సరిగ్గా అర్థం చేసుకునే కౌన్సెలింగ్ వ్యవస్థలు కానీ, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే యంత్రాంగాలు కానీ ఆశించిన స్థాయిలో లేవు. ఇటువంటి లోపాలను సరిదిద్దకుండా కేవలం నిషేధాన్ని విధిస్తే, అది సమస్యను పరిష్కరించకపోగా, పిల్లలను మరింత రహస్య మార్గాల వైపు నెట్టే ప్రమాదమే ఎక్కువ.
డిజిటల్ డిటాక్స్ నేర్పడమే పరిష్కారం !
నిషేధం అనేది కేవలం ఒక గోడను నిర్మిస్తుంది తప్ప, ఆ గోడ అవతల ఉన్న లోకాన్ని అర్థం చేసుకునే విజ్ఞతను ఇవ్వదు. పిల్లలకు సోషల్ మీడియా వల్ల కలిగే లాభనష్టాలను శాస్త్రీయంగా వివరించకుండా, కేవలం వద్దు అని శాసించడం వల్ల ప్రయోజనం సున్నా. పిల్లల మెదడులో కుతూహలాన్ని అణచివేయడం కంటే, దానిని సరైన దిశలో మళ్లించడం తల్లిదండ్రులకు ఉన్న అసలైన సవాలు. సాంకేతికత అందుబాటులో ఉన్నా, దానిలోని మంచి చెడులను వివేకంతో వేరు చేయగలిగే మానసిక పరిపక్వతను వారికి అందించడమే నేటి అవసరం. లేనిపక్షంలో, మన నిషేధాలే వారిని ఆ వ్యసనపు లోతుల్లోకి నెట్టివేసే ఉత్ప్రేరకాలుగా మారుతాయి. భావితరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సమస్యకు పరిష్కారం నిషేధాల్లో లేదు, బాధ్యతాయుతమైన పెంపకం , అవగాహనలో ఉంది. నిషేధం కేవలం ఒక బహిష్కరణ మాత్రమే, అది వ్యక్తిగత క్రమశిక్షణను నేర్పలేదు. సోషల్ మీడియాను నిషేధించడం కంటే, దానిని ఎలా వాడాలో నేర్పించడం, తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించడం , విద్యావ్యవస్థలో నైతిక విలువలపై దృష్టి పెట్టడం అవసరం. ఒక వస్తువు అందుబాటులో ఉన్నా దానిని విజ్ఞతతో తిరస్కరించగలిగే మానసిక పరిపక్వత ను యువతలో తీసుకురావడమే మనం చేయాల్సిన అసలైన పని.
