మిస్ట‌ర్ సోమూ వీర్రాజూ.. మ‌రీ ఇంత అతి పనికి రాదు.. కాస్త తగ్గించుకో..

రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు స‌హ‌జ‌మే. కానీ దానికీ ఓ ప‌రిమితి ఉండాలి. సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్నే తాక‌ట్టు పెట్టే స్థితికి దిగ‌జారొద్దు. అధిష్టానం మెప్పు కోసం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం. కానీ ప్ర‌స్తుతం బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు చేస్తున్న‌ది అదే. క‌ళ్ల ముందే లెక్క‌ల‌న్నీ ప‌క్కాగా క‌నిపిస్తున్నా.. ఆయ‌న మాత్రం ఇంకా అడ్డ‌గోలుగా వాదిస్తూనే ఉన్నారు. బాబు దెబ్బ‌కు సాక్షాత్తూ ప్ర‌ధాని మోదీయే దిగి వ‌చ్చి.. రాష్ట్రానికి వ‌స్తా.. ఏమైనా ప‌థ‌కాలు ప్రారంభోత్స‌వానికి ఉంటే చెప్పండి అని రాష్ట్రానికి లేఖ రాశారు. ఇది కూడా వీర్రాజు కంటికి క‌నిపించడం లేదేమో. లేక ఎలాగూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీతో చేతులు క‌లుపుతాం.. ఇక టీడీపీతో ప‌నేంటి అనుకున్నారేమో. నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏపీకి కేంద్రం అన్నీ ఇచ్చేసింద‌ట‌.. ఇక ఇవ్వాల్సింది ఏమీ లేద‌ట‌. మిస్ట‌ర్ సోమూ వీర్రాజు.. కేంద్రం ఏమిచ్చింది.. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌ట్లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చిందా.. ప్యాకేజీ కింద హోదాను మించి సాయం చేసిందా.. పోల‌వ‌రానికి నిధులిచ్చిందా.. అమ‌రావ‌తికి చేయూతనిచ్చిందా.. ఏమిచ్చింది? క‌నీసం వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఇవ్వాల్సిన వెయ్యి 50 కోట్లు కూడా ఇవ్వ‌లేక‌పోయింది.

మ‌రి అన్నీ ఇచ్చేసిన‌ట్లు మీకు ఎక్క‌డ క‌నిపించింది. అన‌వ‌సరంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.. ఇక రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేద‌న్న‌ట్లు వీర్రాజు మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్‌, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్ట్‌.. ఇవ‌న్నీ కేవ‌లం ప‌రిశీలించాల‌ని అప్ప‌ట్లో చెప్పార‌ట‌. అంతేగానీ క‌చ్చితంగా ఇస్తామ‌న‌లేద‌ట‌. ఎంత దుర్మార్గం. ప్ర‌ధాని మోదీయే తిరుప‌తి స‌భ‌లో ఇవ‌న్నీ చేస్తామని హామీ ఇచ్చిన విష‌యాన్ని మ‌ర‌చిపోయారా.. లేక మోదీ, అమిత్ షా మెప్పు కోసం ఇంత‌లా దిగ‌జారిపోయారా? మీరు బీజేపీకి చెందిన వ్య‌క్తే కావ‌చ్చు.. కానీ అంత‌మాత్రాన సొంత రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయాన్ని చూడ‌లేని దుస్థితిలో ఉండ‌టం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్‌. పోనీ మీర‌న్న‌దే స‌రైన‌దైతే.. మ‌రి కేంద్రం ఎందుకు ఏపీపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌డం లేదు. అన‌ధికారికంగా పార్ల‌మెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చి అంతిచ్చాం.. ఇంతిచ్చాం అని చెప్ప‌డ‌మే త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా చెప్పిందేమీ లేదు. మీరిలా ఎదురుదాడికి దిగుతార‌ని ఊహించే.. చంద్ర‌బాబే ఇప్పుడు కేంద్రం నిర్వాకంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. అది వ‌స్తే మీ బండారం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.