తెలంగాణలో కాబట్టి నై..రా..! అదే ఏపీలో అయితే.. ఈ పాటికి “సై..రా..”!!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ” సై రా.. నరసింహారెడ్డి” సినిమా సెట్టింగ్‌ను.. తెలంగాణ ప్రభుత్వ కూల్చి వేయించింది. ఈ విషయం టాలీవుడ్‌లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా.. ప్రభుత్వ స్థలంలో భారీ సెట్టింగ్ వేసి .. సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఎన్ని సార్లు నోటీసులిచ్చినా… సినిమా యూనిట్ వర్గాలు స్పందించలేదనేది.. రెవిన్యూ అధికారుల ఆరోపణ. అందుకే సెట్టింగ్‌ను కూల్చి వేశామంటున్నారు. తమ వెర్షన్ ఏమిటో సినిమా యూనిట్ బయటకు చెప్పడం లేదు. సెట్ కూల్చివేత కారణంగా.. షూటింగ్ వాయిదా పడింది. ఖాళీగా ఉన్నారు కాబట్టి.. చిరంజీవి.. తనకు వచ్చిన ఓ గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి..ఇంట్లో ఓ మొక్క నాటి వీడియో విడుదల చేశారు.

చిరంజీవి లాంటి మెగాస్టార్ నటిస్తూ.. ఆయన కొడుకు నిర్మిస్తున్న సినిమా సెట్టింగ్‌ను కూల్చివేయడమంటే.. చిన్న విషయం కాదు. మెగాస్టార్‌కు ఉన్న పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ కూడా తెలుసు కాబట్టి.. రెవిన్యూ అధికారులు ఏకపక్షంగా సెట్టింగ్ కూల్చివేసేంత నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఆర్డీవో స్థాయిలో అయినా నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ విశేషం ఏమిటంటే.. సెట్టింగ్ కూల్చివేతపై.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా వ్యతిరేక ప్రకటన చేయలేదు. మెగా ఫ్యామిలీ నుంచి కానీ… సినిమా యూనిట్ నుంచి కానీ.. ఎవరూ స్పందించలేదు. “ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం” అన్నట్లుగా వ్యవహరించారు. విషయం మీడియాకు లీక్ అయింది కానీ… లేకపోతే బయటకు తెలిసేది కాదు. కానీ ఇదే ఏపీలో అయితే పరిస్థితి ఎలా ఉండేది..?

అది ప్రభుత్వ భూమి అయిన కావొచ్చు… నిబంధనలకు విరుద్ధంగా వేసిన సెట్టింగ్ అయినా కావొచ్చు.. పర్మిషన్లు తీసుకోకుండా.. చేస్తున్న షూటింగ్ అయినా కావొచ్చు… ఏపీలో ప్రభుత్వ అధికారులు అలాంటి చర్య తీసుకుని ఉంటే.. ఈ పాటికి రాజకీయం పీక్స్‌కి చేరిపోయి ఉండేది. సామాజికవర్గాల లెక్కలు బయటకు వచ్చేవి. నంది అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఎంతగా పోరాడారో..అంత కంటే ఎక్కువగా పోరాటం చేస్తూ ఉండేవారు. కావాలనే కసి తీర్చుకుటున్నానే సిద్ధాంతాలు వెలుగు చూసేవి. జనసేన ఫ్యాన్స్ చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తమ్ముడు.. తోలు తీస్తామంటూ.. ముందుగా ట్వీట్టర్ లో వార్ ప్రకటించి ఉండేవారు. ఆ తర్వాత ప్రతి పోరాట యాత్ర స్పీచ్‌లోనూ అదే ప్రధాన టాపిక్ అయ్యేది. కానీ.. లక్ ఏమిటంటే.. అది తెలంగాణ అయిపోయింది. నోరెత్తడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ రూల్స్… సెట్ పడగొట్టడంలో ఎలాంటి రాజకీయం ఉండదు. అడగాల్సిన పద్దతిలో అడిగి ఈ పాటికి పర్మిషన్ తెచ్చుకుని..మళ్లీ సెట్టింగ్ ప్రారంభించే ఉంటారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ తెలంగాణ ఓన్లీ..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.