తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాలం నాటిది 1.0 అయితే, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని టెక్నాలజీ వైపు నడిపించిన కాలం 2.0. ఇప్పుడు నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ టీడీపీ 3.0 వెర్షన్‌లోకి అడుగుపెడుతోంది. మారుతున్న కాలం, మారుతున్న ఓటర్ల నాడిని పట్టుకుని పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు లోకేష్ సిద్ధమయ్యారు.
టీడీపీ 3.0 జెన్-జీ ఓటర్లే లక్ష్యంగా లోకేష్ సరికొత్త రోడ్ మ్యాప్!
తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ సంస్థగా కాకుండా, ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఒక స్మార్ట్ పొలిటికల్ ఫోర్స్‌గా మార్చడమే లోకేష్ లక్ష్యం. టీడీపీ 3.0 ‘ అంటే కేవలం టెక్నాలజీ వాడకం మాత్రమే కాదు, పార్టీ సిద్ధాంతాలను యువతకు అర్థమయ్యే రీతిలో చేరవేయడం. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న జెన్-జీ ఓటర్ల ఆలోచనా విధానం గత తరం కంటే భిన్నంగా ఉంటుంది. వారు అభివృద్ధిని, అవకాశాలను కోరుకుంటారు. అటువంటి వారిని ఆకర్షించడానికి లోకేష్ ఇప్పుడు ప్రో-యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. పార్టీలో యువతకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు.
నాయకత్వ లక్షణాలు ఉన్న యువతను గుర్తించి ప్రోత్సాహం
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర టీడీపీ 3.0కి పునాది వేసింది. ప్రజలతో నేరుగా మమేకం కావడం, సెల్ఫీలు దిగడం, వారితో కలిసి భోజనం చేయడం వంటి చర్యల ద్వారా నాయకుడు మన మధ్య ఉండే వ్యక్తి అనే భావనను కలిగించారు. గతంలో ఉన్న బిగువైన రాజకీయ చట్రాన్ని విచ్ఛిన్నం చేసి, సామాన్య కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండేలా పార్టీ నిర్మాణంలో మార్పులు తెస్తున్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న యువతను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి నియోజకవర్గ స్థాయి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ వారసత్వాన్ని తర్వాతి తరానికి బదిలీ చేసే పక్కా రోడ్ మ్యాప్‌ను ఆయన అమలు చేస్తున్నారు.
పార్టీ అంటే ఒక జెండా, ఎజెండా మాత్రమే కాదు.. అదొక సేవ చేసే ప్లాట్‌ఫామ్
రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా పాత్ర కీలకం. టీడీపీ 3.0లో భాగంగా డిజిటల్ నెట్‌వర్కింగ్‌ను లోకేష్ పటిష్టం చేస్తున్నారు. కేవలం ప్రత్యర్థులను విమర్శించడమే కాకుండా, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే ‘విజన్’ను డేటా పాయింట్స్ ద్వారా వివరించడం లోకేష్ శైలి. హలో లోకేష్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను ఆన్లైన్లో స్వీకరించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం వంటి చర్యలు యువతలో ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. పార్టీ అంటే ఒక జెండా, ఎజెండా మాత్రమే కాదు.. అదొక సేవ చేసే ప్లాట్‌ఫామ్ అనే సందేశాన్ని ఆయన బలంగా పంపిస్తున్నారు. పార్టీ సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, జూనియర్ల ఉత్సాహాన్ని సమన్వయం చేయడం లోకేష్‌కు పెద్ద సవాలు. మంగళగిరి విజయం తర్వాత లోకేష్ శైలి పూర్తిగా మారింది. తనపై సాగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని చిరునవ్వుతో తిప్పికొడుతూ, నిరంతరం ప్రజల కోసం శ్రమించే ఫ్యూచర్ లీడర్ ఆయన ఎదిగారు. టీడీపీ 3.0 ద్వారా తెలుగుదేశం పార్టీని కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా కాకుండా, ఒక ఆధునిక రాజకీయ ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు లోకేష్ వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాల్లో కొత్తగా కనిపిస్తున్నాయి.
