టీడీపీ కొత్త కమిటీ చేతుల్లోకి వెళ్లింది. 252 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేసిన టీడీపీ అధిష్టానం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు మంత్రి నారా లోకేష్. నారా లోకేష్‌కు పార్టీ బాధ్యతలు కొత్త కాకపోయినా.. పార్టీ పదవి మాత్రం కొత్తే. లోకేష్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. కానీ అది ప్రాథమిక స్టేజే.. టీడీపీని జెన్ జీకి.. మిలినియల్స్ కు చేరువ చేయాల్సిన టార్గెట్ లోకేష్ మీద ఉంది.
ఇక నుంచి టీడీపీలో లోకేష్ శకం
తెలుగుదేశం పార్టీ చరిత్రలో రేపు ఒక కీలక అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, లోకేష్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. కేవలం చంద్రబాబు కుమారుడిగా కాకుండా, గత ఐదేళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి, యువగళం పాదయాత్ర ద్వారా కేడర్‌లో భరోసా నింపిన లోకేష్‌కు ఇది లభించిన అసలైన గుర్తింపు. ఇప్పుడు అధికారిక హోదాతో పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా టీడీపీలో లోకేష్ శకం పూర్తిస్థాయిలో ప్రారంభమవుతోందని అనుకోవచ్చు.
కొత్త తరానికి పార్టీని దగ్గర చేయడమే లక్ష్యం
చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కొత్త తరానికి నాయకత్వాన్ని అందిస్తున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోవడం వల్ల చంద్రబాబు కేవలం పర్యవేక్షణ కే పరిమితమై, పార్టీ వ్యూహరచనలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. లోకేష్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు, కానీ అసలైన సవాలు ఇప్పుడే మొదలవుతోంది. టీడీపీని జెన్ జీ, మిలీనియల్స్‌కు మరింత చేరువ చేయడమే ఇప్పుడు లోకేష్ ముందున్న ప్రధాన లక్ష్యం. మారుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత ఆలోచనలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను, ప్రచార శైలిని మార్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేవలం సంప్రదాయ ఓటర్లనే కాకుండా, కొత్త తరం ఓటర్లను ఆకట్టుకోవడంలో లోకేష్ టీమ్ ఎంతవరకు సఫలమవుతుందనేది పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
గ్రామస్థాయి నుంచి బలోపేతం దిశగా కొత్త ప్లాన్
నూతన కార్యవర్గంలో 252 మందికి చోటు కల్పించడం వెనుక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, ఇటు యువతకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. లోకేష్ సారథ్యంలో పని చేసే ఈ టీమ్.. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారధిలా పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తూ లోకేష్ తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు.
టీడీపీలో కొత్త అథ్యాయం
లోకేష్‌కు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిదే. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు వారసత్వాన్ని స్మూత్‌గా తదుపరి తరానికి పాస్ చేయడం మరో ఎత్తు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన లోకేష్, ఇప్పుడు తన పరిపాలన దక్షతను పార్టీ వ్యవహారాల్లో ఎలా చూపిస్తారో వేచి చూడాలి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించే ఒక నూతన ప్రస్థానం.
