ఎన్నికలు అవగానే పెట్రోల్, డీజిల్ ధర పెంచుతారన్న దానిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. పెంచినా పర్వాలేదు.. అందుబాటులో ఉంటే చాలన్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇరాన్ హార్మూజ్ ను వదిలేసినా… ట్రంప్ నిర్బంధం వల్ల పరిస్థితి మొదటికి వచ్చింది. అందుకే ఆయిల్ రిజర్వులు తగ్గిపోతూ వస్తున్నాయి. రో వైపు క్రూడ్ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఇలాంటి సమయంలో.. పాత ధరలకే పెట్రోల్ , డీజిల్ దొరుకుతుందని అనుకోవడం అత్యాశే. రేటు పెంచినా ప్రజలకు అందుబాటులో ఉండాలనే పరిస్థితికి దాదాపుగా అందరూ వచ్చారు.
దిగుమతులే మన దేశానికి ఆధారం
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు పైగా ఎగబాకడం, రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న ఉద్రిక్తతలతో ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధిస్తున్న కఠిన నిర్బంధాలు, హార్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఆయిల్ సప్లై చైన్‌ను ఛిన్నాభిన్నం చేశాయి. ఇప్పుడు దేశంలో ధర ఎంత పెరిగినా పర్వాలేదు, కనీసం బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉంటే చాలనే భయాందోళనలు ప్రజల్లో మొదలయ్యాయి.
ధర పెంచుకోవచ్చన్న మానసిక స్థితిలోకి ప్రజలు
రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ఉపశమనం ముగిసిందని, ఏప్రిల్ 29 తర్వాత పెట్రో మంట తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన వాస్తవికత ఏమిటంటే.. ఇది కేవలం మన దేశ పాలకులు తీసుకునే నిర్ణయాలపై మాత్రమే ఆధారపడి లేదు. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు సరఫరా భారీగా తగ్గిపోవడం, భారత ఆయిల్ రిజర్వులు తగ్గిపోవడం మన దేశ ఇంధన భద్రతను ప్రమాదంలో పడేసింది. ఈ పరిస్థితుల్లో ధరల పెంపును కేవలం రాజకీయ కోణంలో చూడటం కంటే, అంతర్జాతీయ సంక్షోభ ప్రభావంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
చాలా కాలంగా ధరలను స్థిరంగా ఉంచిన కంపెనీలు
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలంగా ధరలను స్థిరంగా ఉంచాయి. అప్పట్లో లాభాలు వచ్చాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే ప్రభుత్వానికి కట్టే పన్నులే ఎక్కువ. ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకూ పన్నులను తగ్గించింది. అయినా నష్టాలను భరిస్తూ ఎంతో కాలం సరఫరాను కొనసాగించడం అసాధ్యం. ధరలు పెంచకపోతే సరఫరా నిలిచిపోయి, కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే, ఇప్పుడు రేటు పెరిగినా సరే.. వ్యవసాయం, రవాణా రంగాలకు అంతరాయం కలగకుండా డీజిల్ అందుబాటులో ఉండటమే ప్రభుత్వానికి పెద్ద టాస్క్.
యుద్ధంతో భారత్‌కు సంబంధం లేదు!
రాజకీయ పార్టీలు కూడా వాస్తవ పరిస్థితులను విస్మరించి కేవలం విమర్శలకే పరిమితం కావడం వల్ల ప్రయోజనం లేదు. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి దేశాల మధ్య వైరం, సరఫరా మార్గాల మూసివేత వంటివి ఏ పాలకుల చేతుల్లోనూ లేవు. ప్రజలు కూడా ఇప్పుడు కేవలం ధరల గురించే కాకుండా, ఇంధన లభ్యతపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం విఫలం కాకూడదు.


