తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రస్తుతం చేస్తున్న క్లీన్ చిట్ హడావుడి ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక పెద్ద రాజకీయ ఉచ్చుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ప్రాథమిక సమాచారాన్ని పట్టుకుని వైసీపీ చేస్తున్న అతి ఉత్సాహం, రాబోయే రోజుల్లో ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసే ప్రమాదం కనిపిస్తోంది.
నివేదికకు వైసీపీ ఆమోద ముద్ర
ప్రస్తుతం వైసీపీ నేతలు సిట్ ఛార్జిషీట్లో జంతు కొవ్వు అనే పదం లేదని చెబుతూ సంబరపడుతున్నారు. ఇదే రిపోర్టును వారు ఇప్పుడు నూటికి నూరు శాతం సమర్థిస్తున్నారు. అయితే, ఇదే నివేదికను ఇప్పుడు ఆమోదించడం ద్వారా భవిష్యత్తులో అదే నివేదిక ఆధారంగా ప్రభుత్వం లేదా కోర్టులు చర్యలు తీసుకుంటే, అప్పుడు దానిని వ్యతిరేకించే నైతిక హక్కును వైసీపీ కోల్పోతుంది. రిపోర్టు సూపర్ అని ఇప్పుడు అంటున్న వారే, రేపు అదే రిపోర్టుతో శిక్షలు పడితే కుట్ర” అని అనలేరు. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా మౌనం వహించడం వెనుక వైసీపీని ఈ ట్రాప్‌లోకి లాగడమే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
నిజం బయటపడితే పరిస్థితి ఏంటి?
ఛార్జిషీట్లో కేవలం జంతు కొవ్వు ప్రస్తావన లేనంత మాత్రాన అది కల్తీ లేని నెయ్యి అని అర్థం కాదు. అసలు అది నెయ్యే కాదని, కేవలం కెమికల్స్ , వెజిటబుల్ ఆయిల్స్‌తో చేసిన మిశ్రమమని సిట్ నిర్ధారించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కోర్టు విచారణలో జంతు కొవ్వు లేదు సరే.. మరి ఈ కెమికల్ నెయ్యిని భక్తులకు ఎందుకు తినిపించారు అనే ప్రశ్న వస్తే వైసీపీ దగ్గర సమాధానం ఉండదు. బుల్లెట్ దిగిన తర్వాత గానీ నొప్పి తెలియదు అన్నట్లుగా, కోర్టులు ఈ రిపోర్టుపై సీరియస్ అయినప్పుడు వైసీపీ అసలు ఇబ్బందులు మొదలవుతాయి. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని పెద్దగా అడ్డుకోవడం లేదు. వైసీపీ ఎంత ఎక్కువగా ఈ రిపోర్టును ఓన్ చేసుకుంటే, అంత సులభంగా వారిని ఆ నివేదికలోని ఇతర తీవ్రమైన అంశాలతో కెమికల్ కల్తీ, టెండర్ల అక్రమాలు ఇరికించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. శత్రువు తనంతట తానుగా గోతిలో పడే వరకు వేచి చూసే వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీని ప్రభుత్వం అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
వైవీ సుబ్బారెడ్డి ముందస్తు అప్రమత్తత
చిత్రమేమిటంటే, వైసీపీ నేతలంతా క్లీన్ చిట్ మూడ్‌లో ఉంటే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తనకు సిట్ మీద నమ్మకం లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. భవిష్యత్తులో సిట్ రిపోర్టు ఆధారంగా తనపై చర్యలు తీసుకుంటే, మొదటి నుంచే నాకు ఈ విచారణపై నమ్మకం లేదు అని తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ మిగిలిన వైసీపీ నేతలు ఈ లోతును గమనించకుండా సంబరాల్లో మునిగిపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చు.
కోర్టు బోనులో అసలు యుద్ధం
ఈ మొత్తం వ్యవహారం త్వరలోనే కోర్టు ముందుకు రానుంది. సిట్ ఇచ్చిన ఛార్జిషీట్లోని లోపాలను లేదా అందులోని కెమికల్ కల్తీ అంశాలను కోర్టు విశ్లేషించినప్పుడు అసలు రాజకీయం మొదలవుతుంది. జంతు కొవ్వు లేదని వైసీపీ చేసుకుంటున్న ప్రచారం కేవలం సాంకేతిక అంశం మాత్రమే అని, ఐదేళ్ల పాటు జరిగిన అపచారంపై శిక్షలు తప్పవని కోర్టు గనుక భావిస్తే వైసీపీ నిండా మునిగిపోవడం ఖాయం. ఇప్పుడు వైసీపీ పంచుకుంటున్న స్వీట్లు రేపు చేదుగా మారే అవకాశం ఉంది. రాజకీయాల్లో అత్యుత్సాహం ఒక్కోసారి ఎలా రివర్స్ అవుతుందో చెప్పడానికి ఈ కల్తీ నెయ్యి ఎపిసోడ్ ఒక ఉదాహరణగా నిలవబోతోంది.
