చైతన్య : అందరూ విమర్శించే వాళ్లే..! నిఖార్సైన జర్నలిస్ట్ రవిప్రకాష్..!

(This article is part of Telugu360 Contributor Network and hasn't been edited by our team. If you have any questions or want to contribute, reach out to krishna@telugu360.com)

టీవీ9 అమ్మకం వ్యవహారం… ఆ సంస్థ నుంచి రవిప్రకాష్‌ను.. రవిప్రకాష్‌ను పంపేసిన తర్వాత.. రెండు రోజుల్లోనే..ఆయనకు వ్యతిరేకంగా.. సోషల్ మీడియాలో ఓ సునామీ కనిపిస్తోంది. ఆజ్ఞాతంలోకి వెళ్లారని.. పరారయ్యారని… ప్రచారం చేసుకుని సంబరపడుతున్నారు. గతంలో.. తమ పట్ల.. తమ అభిమాన నేత పట్ల.. తమ పార్టీ పట్ల.. తమ అభిమాన కథానాయకుడిపట్ల.. అలా టీవీ9లో అలా కథనాలు రాశారని.. ఇలా కథనాలు రాశారని గుర్తు చేసుకుని మరీ.. తగిన శాస్తి జరిగిందన్నట్లుగా సంబరపిపోతున్నారు. నిజానికి ఇది… జర్నలిస్ట్‌గా రవిప్రకాష్ నిజాయితీకి.. సర్టిఫికెట్‌లాంటిది. ఎవరి విషయంలోనూ ఆయన పక్షపాతంతో వ్యవహరించలేదని.. టీవీ9కి రేటింగ్స్ తో తప్ప.. మరెవరితోనూ లింకులు లేవని.. ఆయనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారమే నిరూపిస్తోంది.

అందరూ ద్వేషించేవాడే నిజమైన జర్నలిస్ట్..!

జర్నలిజానికి ఇప్పుడు అర్థం.. పరమార్థం మారుతుందేమో కానీ… నిఖార్సయిన జర్నలిస్టు.. దేనికి భయపడేవాడు కాదు. తను నిజం అని నమ్మిన ప్రతీ వార్తను.. తమ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు చేర్చుతాడు. ఈ క్రమంలో… ఆ జర్నలిస్టు.. ఎన్నో బెదిరంపులు ఎదుర్కోవచ్చు. ఎన్నో స్వప్రయోజనాల ఆశలు కూడా.. ఎదురు రావొచ్చు. సమాజంలో అత్యంత పలుకుబడి ఉన్న వాళ్ల నుంచి… ఇంకా అత్యంత ఆత్మీయుల నుంచి కూడా… కోపతాపాలు రావొచ్చు. కానీ వాళ్లతో సంబంధాల కోసం… వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం.. జర్నలిజం విలువల్ని వదిలేసేవారికి.. విజయం ఎప్పుడూ దరి చేరదు. ఆ విలువల్ని పాటిస్తూ… తనకు తాను నమ్మిన జర్నలిజమే ముఖ్యమనుకునేవారికి …పేరు మాత్రమే ఉంటుంది.. మిగతా అంతా వ్యతిరేకులే ఉంటారు. రవిప్రకాష్.. తన జర్నలిజంలో.. సమాజంలో పేరున్న వారిని వదిలి పెట్టలేదు. అధికార బలవంతుల్ని కూడా ధీటుగానే ఎదుర్కొన్నారు. ఆయనను విమర్శించని రాజకీయ పార్టీ లేదు. నేతలు కూడా లేరు. అంటేనే.. ఆయన ఎంత నిఖార్సుగా తాను నమ్మిన జర్నలిజాన్ని పాటించాడో అర్థం చేసుకోవచ్చు.

విమర్శలకు భయపడితే రవిప్రకాష్ ఈ స్థాయికి వచ్చేవాడు కాదేమో..?

తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియా యుగం ప్రారంభమైనప్పటి నుంచి టీవీ9పై విమర్శలు ఉన్నాయి. టీవీ మీడియా జర్నలిజం అంటే… ప్రజలను భావోద్వేగాలకు గురి చేసే వార్తలు ఇచ్చి వారి ఆదరణ పొందడమే కాన్సెప్ట్‌తో అడుగడుగునా… ముందడుగు వేశారు. ఈ క్రమంలో.. టీవీ9కి రవిప్రకాష్‌కి వచ్చిన శాపనార్ధాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాలకు సంబంధం లేదని ఎన్నో సాధారణ వార్తలను కూడా సెన్సేషనలైజ్ చేసి.. ప్రజలను ఉత్కంఠకు గురి చేసి రేటింగ్ పెంచుకున్నారు. టీవీ9కు అవే స్ట్రాంగ్ పిల్లర్లు అయ్యాయి. ఏ టీవీ ప్రేక్షకుడిని కదిలించినా.. టీవీ9ను విమర్శనాత్మక కోణంలోనే చూస్తారు. కానీ.. వారే.. టీవీ9 ప్రధమ ప్రేక్షకులు. ఎదైనా ఇన్సిడెంట్ జరిగినా.. ఏదైనా కొత్త న్యూస్ కోసం అయినా… విమర్శించేవాళ్లు కూడా మొదటగా టీవీ9నే పెడతారు. అది రవిప్రకాష్ నేతృత్వంలో టీవీ9 సాధించిన క్రెడిబులిటీ. విమర్శలు చేసేవాళ్లే.. టీవీ9కి నిజమైన వ్యూయర్స్. మొదట్లోనే … తిట్టేవాళ్లు ఎక్కువైపోతున్నారని… రవిప్రకాష్ వెనుకడుగు వేసి ఉంటే.. టీవీ9 ఈ పాటికి కాలగర్భంలో కలసి ఉండేదేమో..?

రవిప్రకాష్‌కు సామాజికవర్గమే శాపం..!?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు. ఓ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. రాజకీయాల్లో ఓట్ల ప్రకారం చూసుకునే… సామాజికవర్గాల లెక్కలు… నేరుగా.. ఇతర రంగాల్లోకి వచ్చేశాయి. సైన్స్‌ను పుక్కిట పట్టిన పెద్దల దగ్గర్నుంచి… జర్నలిజంలో పండిపోయిన మేధావుల వరకూ .. అందరూ.. సామాజికవర్గ కోణంలోనే చూస్తున్నారు. ఈ క్రమంలో రవిప్రకాష్.. ఓ పాలకవర్గానికి చెందిన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడమే… ఆయన చేసిన శాపంలా ఉంది. ఆ సామాజికవర్గంపై విరుచుకుపడేవాళ్లంతా.. రవిప్రకాష్ ను టార్గెట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో కానీ.. విజయసాయిరెడ్డి లాంటి ఇతర రాజకీయ నేతలు చేస్తున్న విమర్శల్లో కానీ.. కనిపిస్తున్నది… సామాజికవర్గ కోణమే. బహుశా రవిప్రకాష్‌కే అదే శాపం.

తెలుగు టీవీ మీడియాలో ఎప్పటికీ మొదటి పేరు ఆయనదే..!

రవిప్రకాష్.. నెక్ట్స్ ఏం చేస్తారో.. ఆయనిష్టం. కానీ.. ఫైర్ ఉన్న జర్నలిస్టుగా.. తన జీవితాన్ని టీవీ9కి దేశవ్యాప్త గుర్తింపు తీసుకు రావడంలో మాత్రం.. ఆయనది సింగిల్ హ్యాండ్. ఆ కష్టానికి రూ. 500 కోట్లు విలువ కట్టి.. ఎవరో కొనేసుకుని ఉండవచ్చు కానీ… ఆ ముద్రను మాత్రం ఎవరూ చెరేపేయలేరు. ఎంతో మంది.. యువ జర్నలిస్టులకు ఆయన స్ఫూర్తి ప్రదాత. ఆయన ప్రొత్సహిస్తే.. జర్నలిజంలోకి వచ్చి.. ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నవాళ్లు ఉండవచ్చు. కానీ .. ఆ మొక్కలన్నీ రవిప్రకాష్ నాటినవే. ఆ ముద్రను చెరపలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com