కరణ్ జోహార్ సినిమా నుంచి ప్రభాస్ ఔట్: ఒక విశ్లేషణ

ఒక సినిమా జరిగేటపుడు దానికి పనిచేసే వ్యక్తుల మధ్య రకరకాల భవిష్యత్ ప్రాజెక్టులు అనుకుంటూ ఉంటారు. వాటిలో కొన్ని కార్యరూపం దాలుస్తాయి, కొన్ని అటకెక్కుతాయి. అందుకు వేర్వేరు కారణాలుంటాయి. కానీ కొన్ని సార్లు మరీ అసంబద్దమైన కారణాలతో కూడా ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతుంటాయి. బాహుబలి ని హిందీ లోకి తీసుకెళ్ళిన నిర్మాత కరణ్ జోహార్ అప్పట్లో ప్రభాస్ ని హిందీ లో లాంచ్ చేస్తూ తాను ఒక సినిమా తీస్తానని అన్నాడు. కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి ప్రభాస్ ఔట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. కానీ అందుకు కారణమే కాస్త అసంబద్దంగా అనిపిస్తోంది.

ప్రభాస్ ఈ సినిమా కోసం 20 కోట్లు అడిగాడని తెలుస్తోంది. ఆ పారితోషికం కారణంగానే కరణ్ జోహార్ ప్రభాస్ ని వద్దని వరుణ్ ధావన్ తో ఈ సినిమా తీయడానికి సిద్దమవుతున్నట్టు ఆంగ్ల పత్రికల్ల్లో కథనాలు దర్శనమిచ్చాయి. కరణ్ జోహార్ బృందం ప్రభాస్ అడిగిన పారితోషికం చాలా అసంబద్దమని భావించినట్టు , దక్షిణాది స్టార్స్ లో ఎవరికీ రజనీకాంత్ తో సహా బాలీవుడ్ లో అంత మార్కెట్ లేదని, అంత పారితోషికం ప్రభాస్ తో అస్సలు వర్కవుట్ కాదని అందుకే ప్రభాస్ ని కాదని బాలీవుడ్ యువ హీరో, ఇటీవల జుడ్వా-2 (మొదటి జుడ్వా మన హలో బ్రదర్ సినిమాకి రీమేక్) తో హిట్టు కొట్టిన వరుణ్ ధావన్ తో సినిమా కి మొగ్గు చూపిందని ఆ కథనం వ్రాసింది. దీనికి తోడు కరణ్ జోహార్ ఒక నర్మగర్భమైన ట్వీట్ చేసాడు – “ధ్యేయమా, నీ పూర్తి సామర్థ్యం బయటపడాలంటే నీ ఆజన్మ శత్రువు ‘ఒకరితో పోల్చుకోవడం’ (అనే దురలవాటు) కి దూరంగా ఉండాలి” అనేది ఆ ట్వీట్. బాలీవుడ్ జనాలు – ప్రభాస్ ని ఉద్దేశ్యించే కరణ్ ఆ ట్వీట్ చేసాడని, బాలీవుడ్ హీరోలతో పోల్చుకోదగ్గ పారితోషికాన్ని ప్రభాస్ డిమాండ్ చేయడం ద్వారా బాలీవుడ్ లో తన భవిస్యత్తు ని తానే దెబ్బతీసుకుంటున్నాడనే భావం అందులో ఉందని వారంటున్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రభాస్ 20 కోట్లు అడిగాడని ప్రభాస్ ని కాదన్న కరణ్, వరుణ్ ధావన్ కి మాత్రం 25 కోట్లు ఇస్తున్నాడని తెలుస్తోంది. అదీ కాక ప్రభాస్ మార్కెట్ బాహుబలి తర్వాత విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాల కంటే ముందుగా 1000 కోట్ల మార్కు దాటిన బాహుబలి లో హీరో మరి తను. రాజమౌళి క్రెడిట్ సంగతి ఎలా ఉన్నా, ప్రభాస్ బాహుబలి పాత్రని మెప్పించిన తీరు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. పైగా బాహుబలి లో భల్లాల దేవుడి పాత్ర పోషించిన రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా హిందీ డిజిటల్ రైట్స్ దిమ్మతిరిగే రేంజ్ లో అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఆ లెక్కన ప్రభాస్ మార్కెట్ కి తను అడిగిన రెమ్యూనరేషన్ సమంజసంగానే అనిపిస్తోంది. పైగా హిందీ లో కరణ్ జోహార్ సినిమా తీసినా తెలుగు డబ్బింగ్ రైట్స్ స్ట్రెయిట్ సినిమాకి సమానంగా అమ్ముడవుతాయనడం లో సందేహం లేదు. ఇక ద్విభాషా చిత్రం గా తీస్తే ఆ లెక్కే వేరు. సో, మార్కెట్ లెక్కల ప్రకారం చూసినా, ప్రభాస్ సాహో సినిమాకి తీసుకున్న (దాదాపు 30 కోట్లు అంటున్నారు) పారితోషికం తో పోల్చి చూసినా ప్రభాస్ 20 కోట్లు అడగడం మరీ అసంబద్దంగా అయితే ఖచ్చితంగా లేదు.

మరి ఎక్కడ తేడా కొట్టింది. బహుశా బాలీవుడ్ జనాలకి రజనీకాంత్ సహా ఏ దక్షిణాది స్టారయినా కాస్త చిన్నచూపే కాబోలు అంటున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ లో 100 కోట్ల కలెక్షన్ టచ్ చేయడానికి కబడ్డీ కబడ్డీ అంటూ ఒకసారి గీత టచ్ చేసి ఒకసారి మిస్ అవుతున్న హీరోలు కూడా పాతిక కోట్ల దాకా డిమాండ్ చేస్తుంటే కిమ్మనకుండా సమర్పించుకుంటున్న కరణ్ జోహార్ లాంటి వాళ్ళు ప్రభాస్ దగ్గరికి వచ్చేసరికి ఇలా లెక్కలు కట్టడానికి ఆ దృక్పథమే కారణమని అంటున్నారు వాళ్ళు. ఏది ఏమైనా, బాలీవుడ్ మాత్రమే ఇండియన్ సినిమా అని భావిస్తున్న జనాల దృక్పథాన్ని, బాహుబలి పటాపంచలు చేసినా, ప్రాంతీయ హీరోల విషయం లో ప్రత్యేకించి దక్షిణాది హీరోల విషయం లో బాలీవుడ్ జనాల దృక్పథం మారటానికి మాత్రం ఇంకా సమయం పట్టేట్టుంది. కాస్త సమయం పట్టినా ఆ దృక్పథం మారిపోయి, ప్రాంతీయ సినిమాలూ, “పాన్-ఇండియా” సినిమాలుగా ప్రాంతీయ తారలూ, “పాన్-ఇండియా” తారలుగా వెలిగే తరుణం మాత్రం తప్పకవస్తుంది!!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.