అంద‌రూ ఆ ‘ఫిరాయింపుల తాను’లో ముక్క‌లే క‌దా!

ఫిరాయింపు రాజ‌కీయాల‌ను అడ్డుకునేది ఎవ‌రు..? రాజ‌కీయ పార్టీలు అనుస‌రిస్తున్న ఈ కుసంస్కారాన్ని నిర్మూలించేది ఎవ‌రు..? అధికారం పేరుతో ఇత‌ర పార్టీల‌ను నిర్వీర్యం చేసే ఈ ఎత్తుగ‌డ‌కు చెక్ పెట్టేది ఎవ‌రు..? అవహేళన పాలౌతున్న ప్రజా తీర్పును రక్షించేది ఎవరు..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఎవ్వ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు. ఎందుకంటే, అంద‌రూ ఆ తానులో ముక్కలే! అధికారంలో ఎవ‌రు ఉంటే, వారు ఈ ఫిరాయింపుల మార్గాన్నే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా ఎంచుకుంటున్నారు. కాబ‌ట్టి, ఈ విష‌యంలో ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అని బేరీజు వేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఫిరాయింపుల సంగ‌తి తెలిసిందే. వైకాపా నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేర‌డం, వారిలో ఓ న‌లుగురు మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించ‌డం చూస్తూనే ఉన్నాయి.ఇప్పుడు, ఈ ఫిరాయింపుదారుల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే తాము అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌డం లేదంటూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. రాష్ట్రప‌తితో పాటు ప్ర‌ధానికి కూడా ఓ లేఖ రాసి, చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కోరారు. అయితే, ఈ లేఖ వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..? కేంద్రం చ‌ర్య‌లు తీసేసుకుంటుందా..? దేశ‌వ్యాప్తంగా ఏపీ ఫిరాయింపుల గురించి తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రిగిపోతుందా..? ఈ ప్ర‌శ్న‌ల‌కూ ‘అంత సీన్ ఉండ‌ద‌’నే స‌మాధానం చెప్పుకోవాలి.

ఏపీ ఫిరాయింపుల విష‌య‌మై ప్ర‌ధానికి లేఖ పంపుతాం, జాతీయ మీడియాకు కూడా కాపీ ఇస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు. ప్ర‌ధానికి లేఖ ఇచ్చినా అది బుట్ట దాఖ‌లే అవుతుంది. ఎందుకంటే, భాజ‌పా చేస్తున్న ఫిరాయింపు రాజ‌కీయాలేం త‌క్కువ‌గా లేవు క‌దా! ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుని మ‌రీ అధికారం హ‌స్త‌గ‌తం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో వారు ప్ర‌యోగిస్తున్న‌ది కూడా ఈ ఫిరాయింపు అస్త్రమే. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో భాజ‌పా చేసిన రాజ‌కీయ‌మేంటి..? సరిగా ప‌ట్టు దొర‌క‌లేదుగానీ… త‌మిళ‌నాడులో కూడా ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కే తెర తీసింది కూడా వారే క‌దా! ఇక‌, తెలంగాణ విష‌య‌మే తీసుకుంటే.. పార్టీ విస్త‌ర‌ణ‌లో భాగంగా టి. కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేత‌ల్ని టార్గెట్ చేసుకుని, వారికి భాజ‌పా తీర్థం ఇవ్వాల‌నుకోవ‌డం ఏ త‌ర‌హా రాజ‌కీయం అవుతుంది..? ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పార్టీ విస్త‌ర‌ణ వ్యూహంలో కూడా ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆక‌ర్షించాల‌నే వ్యూహం ఉండ‌నే ఉంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ భాజ‌పాకి కావాల్సినంత‌ ఉంది. కాబట్టి, జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టు ఎవ‌రో స్పందించేసి, దేశ‌వ్యాప్తంగా ఏదో చ‌ర్చ జ‌రిగిపోయే ప‌రిస్థితి అయితే ఉండ‌దు.

అంతెందుకు.. వైయ‌స్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా టీడీపీ నేత‌ల్ని ఆయ‌న కూడా ఆర్షించారు క‌దా! దాన్ని ఏ త‌ర‌హా రాజ‌కీయం అనాలి..? ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో టీడీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డిని వైకాపాలోకి పిలుచుకోలేదా..? దాన్ని కూడా ఈ త‌ర‌హా రాజ‌కీయ‌మే అంటారు క‌దా. పోనీ… ఏపీలో జ‌రిగిన ఫిరాయింపుల‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారూ, టీడీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అంటే, అదీ లేదు. ఒక‌వేళ అలాంటింది ఉంటేగింటే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌కూడ‌దు. భూమా నాగిరెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యే. ఆయన గెలిచింది వైకాపా టిక్కెట్ మీదే. తరువాత టీడీపీలో చేరిపోయారు. ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆ కుటుంబ అభ్య‌ర్థే టీడీపీ త‌ర‌ఫున గెలిచారు. అంటే, నంద్యాల ఫలితాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపించి ఫిరాయింపు రాజ‌కీయాల‌కు ప్ర‌జామోదం ఉంద‌ని చెప్ప‌డం ఇక్క‌డ ఉద్దేశం కాదు. ఈ ఫిరాయింపు రాజకీయాలను నంద్యాల‌లో టీడీపీ ఒక‌లా వాడుకుంటే, ఇప్పుడు ఫిర్యాదుల పేరుతో ఇదే ప్ర‌క్రియ‌ను వైకాపా మ‌రోలా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ద‌క్కేలా ప్ర‌య‌త్నిస్తోంది.

జ‌గ‌న్ మాన‌సికంగా ఎప్పుడో ముఖ్య‌మంత్రి అయిపోయారు. అఖిలాంధ్రులకు ఆయన అప్రకటిత ‘అన్న’గా తనను తాను ప్రతిష్టించేసుకున్నారు. కాబ‌ట్టి, ఇంకా ప్ర‌తిప‌క్ష నేత అనే పేరుతో అసెంబ్లీకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటున్న‌ట్టుగా ఉంది. ఆయన పాయింటాఫ్ వ్యూలో ఎలాగూ ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి కాబ‌ట్టి, ఈలోగా అసెంబ్లీతో మ‌న‌కేం ప‌ని అని భావిస్తున్న‌ట్టున్నారు! ఈ అతి విశ్వాసంతో చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఇవ్వాల్సిన మ‌ర్యాద త‌ప్పుతున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు పాల్పడుతున్నారు. దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డం కోసం ఫిరాయింపుల‌పై పోరాటం అనే అంశాన్ని పైపూత‌గా వేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావడం కంటే, పాదయాత్రే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించకుండా ఉంటారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.