విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా : ‘ఎన్నెన్నో అందాలు’

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు స్టార్ అయిపోయాడు. అర్జున్‌రెడ్డి పాత్ర‌, ఆ సినిమా.. విజ‌య్‌ని స్టార్‌ని చేసేశాయి. అత‌నితో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ క్యూ క‌డుతున్నారు. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీ రోజు ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ చెప్పిన క‌థ‌కూ విజ‌య్ ఒకే అనేశాడు. కె.ఎస్‌.రామారావు ఈ చిత్రానికి నిర్మాత‌. క‌థ పూర్త‌య్యింది. 2018 ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి ‘ఎన్నెన్నో అందాలు’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజులో ఓ స‌రికొత్త ల‌వ్ స్టోరీ చెప్పాడు క్రాంతి మాధ‌వ్‌. ఈసారీ… ప్రేమ‌లో కొత్త కోణం వెలికి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయ‌ని తెలిసింది. దానికి త‌గ్గ‌ట్టే.. రెండు మూడు గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అర్జున్ రెడ్డి కంటే ముందే ఓకే చేసిన సినిమా ఇది. కాబ‌ట్టి.. పాత పారితోషికాల‌కే ఈ సినిమా ఓకే చేసేశాడు విజ‌య్‌. ఆ విధంగా… కె.ఎస్. రామారావు జాక్ పాట్ కొట్టిన‌ట్టే. ప్ర‌స్తుతం ఉంగ‌రాల రాంబాబు రిలీజ్ హ‌డావుడిలో ఉన్నాడు క్రాంతిమాధ‌వ్. వ‌చ్చే నెల నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభిస్తార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com