మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ‘ఇదిగో.. అదిగో..’ అనడం తప్ప.. మోక్షు కెమెరాముందుకు వచ్చింది లేదు. అప్పుడెప్పుడో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి, సెట్స్ పైకి వెళ్తుందనగా ఆపేశారు. ఆ తరవాత క్రిష్ దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ అన్నారు. బాలకృష్ణ – మోక్షజ్ఞ కలిసి నటిస్తారని చెప్పుకొన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్టే. స్క్రిప్టు విషయంలో బాలయ్య సంతృప్తి చెందలేదని, అందుకే క్రిష్ తప్పుకొన్నారని, మరో దర్శకుడి అన్వేషణలో బాలయ్య ఉన్నారని సమాచారం. ఆ దర్శకుడు దొరకేంత వరకూ.. ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలదు. దాంతో మోక్షు ఎంట్రీ మరింత ఆలస్యం అవ్వబోతోంది.
పైగా.. బాలయ్య దృష్టి ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపై ఉంది. ఈ కథపై కొన్ని రోజులుగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ సినిమా వ్యవహారం ఓ కొలిక్కి వస్తే తప్ప, ఆదిత్య 999పై బాలయ్య దృష్టి పెట్టే అవకాశం లేదు. ‘ఆదిత్య 999’ని పక్కన పెట్టి, మోక్షు కోసం ఓ కొత్త కథ ఎంచుకొని, దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుంది. కాకపోతే.. ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మోక్షుని తీసుకెళ్లి కొత్త దర్శకుడి చేతిలో పెట్టే రిస్క్ బాలయ్య చేయరు. అందుకు అనుభవజ్ఙుడు కావాలి. పైగా.. ‘ఆదిత్య 999’ తోనే మోక్షు ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బాలయ్య గట్టిగా ఫిక్సయ్యారు. ఆ కథని హ్యాండిల్ చేసే దర్శకుడు దొరికితే తప్ప… మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత రాదు.
ఇప్పటికే మోక్షు విషయంలో నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. మోక్షు ఎంట్రీ లేట్ అయ్యే కొద్దీ.. ఆ అసంతృప్తి పెరుగుతూపోతుంటుంది. ఈ యేడాది కూడా తన ఎంట్రీ అవ్వకపోతే.. వాళ్లూ మోక్షుని లైట్ తీసుకొనే ప్రమాదం ఉంది.
