ఈ సంక్రాంతికి వచ్చిన ‘రాజాసాబ్’ ప్రభాస్ అభిమానుల్ని నిరాశ పరిచింది. నార్త్ లో కూడా ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. సంక్రాంతి సీజన్ అయిపోయింది కాబట్టి, ఈ సినిమా లెక్కలు ఒకొక్కటిగా బయట పడుతున్నాయి. నష్టం ఎంత అన్నది క్లియర్ గా తెలియకపోయినా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది గట్టి దెబ్బే అనేది ఇన్ సైడ్ వర్గాల టాక్. సినిమా పోవడం, నష్టాలు రావడం ఒక ఎత్తయితే – ఈ సినిమాకు సంబంధించిన వేస్టేజీ ఖర్చు ఇంకా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సినిమా కోసం 4 గంటల ఫుటేజీ తీశారు. అందులో వాడింది మూడు గంటలే. అంటే గంట సినిమా అలానే ఉంది. తీసిన సీన్లు పక్కన పెట్టడం, వేస్టేజీ వల్ల దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.
‘రాజాసాబ్’ నాలుగు గంటల ఫుటేజీ వచ్చినప్పుడు రెండు భాగాలుగా తీసి, విడుదల చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే మారుతికి ఇలా ఈ సినిమాని విడగొట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ‘రాజాసాబ్ 2’కి సంబంధించిన కథ ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. ‘రాజాసాబ్’ కోసం తీసిన ఫుటేజీ రెండు భాగాలుగా చేయడం కంటే, రెండో కథని సినిమా గా తీయడమే బెటర్ అనుకొన్నారు. అందుకే పార్ట్ 2 ఆలోచన పక్కన పెట్టారు. కనీసం ఆ ఫుటేజీలోని కొన్ని సీన్లు ఎడిట్ చేసి, ఓటీటీలో రిలీజ్ చేసినా బాగుండేది. కానీ అదీ జరగలేదు. ఏది ఏమైనా ‘రాజాసాబ్’ హిట్టయితే నష్టాల్లోంచి బయటపడిపోదాం అనుకొన్న విశ్వ ప్రసాద్ ఆశలు మాత్రం నెరవేరలేదు. సరికదా, కొత్త నష్టాల్ని మోయాల్సివస్తోంది.
