అత్యుత్సాహం అవసరమా యాదాద్రి నరసింహా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆయత చండీయాగం ఎంత ఆధ్మాత్మికంగా అ(న)ధికార ఆర్బాటంగా చేసినా వ్యక్తిగతం ఖాతాలో కొట్టుకుపోయి వుండొచ్చు.(నిజానికి స్వయానా కెటిఆర్‌ కూడా ఆ తతంగంలో పెద్ద పాత్ర వహించలేదు) కాని అధికార హౌదాలో యాదాద్రి నిర్మాణంలో తనే సర్వం నెత్తిన వేసుకోవడం ఎలాటి విధానం? తెలంగాణలో ప్రధాన తీర్థయాత్రాస్థలిగా యాదగిరిని పెంపొందించాలనే ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ఇహలోక సంబంధమైన రియల్‌ ఎస్టేట్‌ రేట్ల పెంపు, పట్టణీకరణ ప్రణాళికలు వంటివి కూడా వుండొచ్చు. ఇందుకోసం తెలంగాణకే తలమానికమైన సుప్రసిద్ధమైన యాదగిరి పేరును సంసృతీకరించి(అది కూడా తాను తీసుకొచ్చిన జియ్యర్‌ స్వామి ద్వారా) యాదాద్రిగా మార్చడం ఒక వింత. దానికి సంబంధించిన నిర్మాణ పథకాలూ ప్రణాళికలూ స్వయంగా చర్చించి తానే బాధ్యత మీద వేసుకోవడం ఏమిటి? కావాలంటే ప్రత్యేకంగా తనకు నమ్మకస్తుడైన సమర్థుడిని నియమించుకోవచ్చు. వారు సాధుసంతులను సంప్రదించి పూర్తి చేస్తారు. అంతేగాని తానే ఆగమ శాస్త్ర మీమాంసలు తేల్చడం, వాస్తుతో సహా నిర్మాణ బాధ్యతలన్నీ మీద వేసుకోవడం.. ఏ విధంగా సమర్థనీయం?ఇది భక్తివిశ్వాసాల ప్రశ్న కాదు. రాజ్యాంగ లౌకికతత్వం, పని విభజనల సమస్య.

వచ్చే దసరా నాటికి యాదాద్రి పూర్తి కావాలంటూ వెంటబడవలసినంత అగత్యం ఒక ముఖ్యమంత్రికి ఏముంటుంది? యాదాద్రి అనేది యాదగిరి నరసింహస్వామి భక్త జనానికి సంబంధించిన అంశం. వారిలో ఒకరుగా కెసిఆర్‌ కూడా మిగిలిన వారికంటే ముందు వుండొచ్చు. కాని ముఖ్యమంత్రి హౌదాను దానికోసం వినియోగించడమేమిటి? ఇది సచివాలయమో లేక విద్యాలయమో కాదే? ఒక దేవాలయం. దానికి దేవాదాయ శాఖ వుంటుంది. ఈ రోజున యాదగిరి నరసింహస్వామి అయితే రేపు మరో జుమ్మా మసీదు ఆ మరుసటి రోజు మెదక్‌ చర్చి ఇలా మతైక విషయాలలో మునిగితేలాలా? లేక ఒక మతక్షేత్ర నిర్మాణంపై ప్రత్యేక శధ్రచూపి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశారన్న విమర్శ తెచ్చుకోవాలా? పండుగలకు కానుకలివ్వడం, పుష్కరాల వంటి సందర్బాల్లో ఏర్పాట్టు చేయడం లేదంటే బతకమ్మ నిర్వహించడం ఒక విషయం.కాని ఈవోలు ఇంజనీర్లు చూసుకోవలసిన ఆలయాల బాధ్యతలు కూడా ప్రభుత్వాధినేతలు చేస్తామంటే లౌకిక సూత్రాలు దెబ్బ తినిపోవడం అనివార్యం. పైగా దీనికి అంతంటూ వుండదు. అనవసర అసంతృప్తులూ తప్పవు. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం చాలా వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com