టీడీపీతో బంధంపై కేవీపీ స్పందనేమిటి..? కాంగ్రెస్‌లోనే ఉంటారా..?

ఆంధ్రప్రదేశ్ కంగ్రెస్ పార్టీలో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి ఉంది. తమ రాజకీయ జీవితంలో ఏ పార్టీతో అయితే.. సుదీర్ఘ కాలంగా పోరాడామో.. ఇప్పుడా పార్టీతోనే కలసి పనిచేయాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన ఉన్న నేతలు.. ఇలాంటి పరిస్థితి రావడం కూడా గొప్పేనని భావిస్తున్నారు. అంటరాని పార్టీగా మిగిలిపోతుందేమోనని నేతలు భయపడిపోయారు. అందుకే చాలా మంది వేరే పార్టీలు చూసుకున్నారు. వేరే పార్టీల్లో అవకాశం దొరకని వాళ్లు.. కాంగ్రెస్‌పై అభిమానం ఉన్న వాళ్లు అతి కొద్ది మంది మాత్రమే పార్టీలో మిగిలారు. ఇందులోనూ…ఓ ప్రత్యేకమైన వర్గం ఉంది. అది చంద్రబాబునాయుడు పొడే గిట్టని వర్గం. వైఎస్ హయాంలో… రాజకీయంగా… ఉన్నతంగా బతికి చివరికి… ఎటూ కాకుండా పోయిన నేతలు వీళ్లు. ఇప్పుడు.. వాళ్లు చంద్రబాబు కనుసన్నల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వారందరికి నాయకుడు.. కేవీపీ రామచంద్రరావు. వైఎస్ హయాంలో.. కేవీపీనే అందరికీ గాడ్ ఫాదర్.

ఈ కేవీపీ అంటే.. చంద్రబాబుకు ఎంత కోపమో… చంద్రబాబు అంటే.. ఈ కేవీపీకి అంత కంటే ఎక్కువ కోపం. జగన్ దగ్గరకు రానీయలేదో.. లేకపోతే.. ప్రత్యేకమైన మిషన్ ఏమైనా ఉందేమో కానీ.. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం.. ప్రాణస్నేహితుడు కొడుకు అయిన జగన్ ను ఒక్క మాటంటే.. ఒక్క మాట ఎప్పుడూ అనలేదు. కానీ… తెలుగుదేశం పార్టీపై మాత్రం ఒంటికాలితో లేచేవారు. అలవాటైన కాంట్రాక్టులు కాబట్టి.. పోలవరంపై పదే పదే లేఖలు రాసేవారు. చివరికి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ దగ్గర అవుతుందన్న ప్రచారం ప్రారంభమైన తర్వాత.. అంటే.. పార్లమెంట్‌లో అవిశ్వాస ఘట్టం ముగిసిన తర్వాత.. ఓ రోజు.. విజయవాడ వచ్చి.. నేరుగా… ఆంధ్రరత్న భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టేశారు. దేని గురించి అంటే.. పోలవరం విషయంలో చంద్రబాబును విమర్శించడానికి..!. ఇది వివాదాస్పదం అయింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. హైకమాండ్ కు దగ్గరగా ఉండే జేడీ శీలం లాంటి వాళ్లు నేరుగా.. రాహుల్‌కే ఫిర్యాదు చేశారట. దాంతో కేవీపీ సైలెంట్ అయిపోయారు.

రాహుల్ మినహా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతలతో… వైఎస్ హయాంలోనే సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్న కేవీపీ వాటిని ఇప్పటికీ.. కొనసాగిస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ నేరుగా.. టీడీపీతో సంబంధాలు పెట్టుకుంటోంది కాబట్టి.. కేవీపీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క కేవీపీ మాత్రమే కాదు.. కేవీపీ ఎంత చెబితే.. అంత అన్నట్లుగా ఉండే… పీసీసీ చీఫ్ రఘువీరా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు.. వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.