తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లలోని పొరపాట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. పెరంబూరు , తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుండి పోటీ చేస్తున్న విజయ్, రెండు చోట్లా దాఖలు చేసిన పత్రాల్లో ఆస్తులు , ఇతర వివరాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం ఎన్నికల అధికారుల పరిశీలనకు వచ్చింది. మార్చి 30న పెరంబూరులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న వివరాలకు, ఏప్రిల్ 4న తిరుచ్చి ఈస్ట్‌లో సమర్పించిన అదనపు వివరాలకు పొంతన లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీలు దీనిని హైలెట్ చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆస్తుల విషయంలో గందరగోళం నెలకొంది. తొలుత తన చరాస్తుల విలువ సుమారు రూ. 404 కోట్లుగా పేర్కొన్న విజయ్, తాజాగా సమర్పించిన వివరాల్లో అవి రూ. 410 కోట్లకు పైగా ఉన్నట్లు చూపారు. కేవలం ఆస్తులే కాకుండా, ఆయన వయస్సు విషయంలో కూడా తేడాలు ఉన్నాయి. పెరంబూరు అఫిడవిట్లో 52 ఏళ్లుగా పేర్కొనగా, తిరుచ్చి పత్రాల్లో 51 ఏళ్లుగా నమోదు చేశారు. అలాగే, తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఒకచోట, రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మరోచోట పేర్కొనడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తనపై నమోదైన కొత్త కేసుల గురించి సమాచారం ఆలస్యంగా అందడం వల్లే ఈ వ్యత్యాసాలు వచ్చాయని విజయ్ తరపు న్యాయవాదులు వివరణ ఇస్తున్నారు. అయితే, ఒకే వ్యక్తి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో వేర్వేరు వివరాలతో అఫిడవిట్లు సమర్పించడం సాంకేతికంగా నామినేషన్ తిరస్కరణకు దారితీస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం అఫిడవిట్లో సమాచారాన్ని దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం అయినప్పటికీ, పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అదనపు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం అభ్యర్థికి ఉంటుంది.
ప్రస్తుతం అందరి కళ్లు రిటర్నింగ్ అధికారుల నిర్ణయంపైనే ఉన్నాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో ఈ పొరపాట్లు గనుక తీవ్రమైనవిగా భావిస్తే విజయ్ నామినేషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే, సాధారణంగా ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన దళపతి కి ఈ అఫిడవిట్ వివాదం ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన నామినేషన్ చెల్లుతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
