అసలు కన్నా.. అద్దె మైకుల గోలే ఎక్కువ..! వైసీపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ … తెలుగుదేశం పార్టీపై ముఖ్యంగా చంద్రబాబునాయుడు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందు కోసం పూర్తిగా బ్యాక్‌డోర్ పాలిటిక్స్‌నే నమ్ముకుంటోంది. చంద్రబాబు, జగన్ ఇద్దరిలో ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధారణంగా… చదువుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబునే ఆప్షన్ గా ఎంచుకుంటారు. సామాన్యుల మనసుల్లో ఇరువురి ఇమేజ్‌కి చాలా తేడా ఉంది. చంద్రబాబు సమర్థునిగా… జగన్ అవినీతికి రూపం అనే భావన ఇప్పటికీ ఉంది. ఇప్పుడీ గ్యాప్‌ను తగ్గించడానికి వైఎస్ జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఎలాగూ… చంద్రబాబులా ఇమేజ్ మేకోవర్ ఇప్పటికిప్పుడు చేసుకోలేడు కాబట్టి.. తన స్థాయికి చంద్రబాబును దిగజారిస్తే బ్యాలెన్స్ అయిపోతుందని భావిస్తున్నట్లున్నారు. పార్టీ పరంగా విమర్శలు చేస్తే.. అవి ప్రజల్లో పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వవు. అందుకే చంద్రబాబు బద్ద వ్యతిరేకుల్ని… సిద్ధం చేసి.. వారితో ఆట ప్రారంభించారు.

చంద్రబాబు ఇమేజ్‌ను తన స్థాయికి తీసుకొచ్చేలా చేయడానికి జగన్ ఎంచుకున్న వ్యక్తుల్లో ప్రధానంగా మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, కల్లామ్ అజయ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఇక కొన్ని స్వచ్చంద సంస్థల్ని కూడా ఇందులో భాగం చేశారు. వాటిలో ఇటీవలి కాలంలో… చంద్రబాబుపై నేరుగా దాడికి దిగుతున్న స్వచ్చంద సంస్థ జనచైతన్య వేదిక. ఐవైఆర్, కల్లామ్ అజయ్ రెడ్డి ఇద్దరూ చంద్రబాబు దగ్గర చీఫ్ సెక్రటరీలుగా చేశారు. వారు విమర్శిస్తే … చంద్రబాబుకు చాలా డ్యామేజ్ అని వైసీపీ గట్టి లెక్కలే వేసుకుంది. వీరిద్దరూ ఇప్పుడూ చంద్రబాబును అదే పనిగా విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐవైఆర్ మరింత దూకుడుగా… రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అంతరంగీకులుగా ఉన్నా… ఆ తర్వాత వీరిద్దరు విరోధులుగా మారారు. ఐవైఆర్ టీటీడీ చైర్మన్ పోస్టు అడిగారని.. అజేయ్ కల్లాం..తన చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగింపు అడిగారని.. రెండింటిని చంద్రబాబు తిరస్కరించడం వల్లే… వారు ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు కొద్ది రోజుల్నించి ఆరోపిస్తున్నారు.
వీరితో పాటు సినీ రచయిత, నటుడు .. తనపై తానే “మెంటల్ కృష్ణ” అని సెటైర్లు వేసుకునేంత తిక్క ఉన్న పోసాని కృష్ణమురళీని రంగంలోకి తెచ్చారు. వైసీపీలో చేరేది లేదని చెబుతున్న ఆయన… ఆ పార్టీ నాయకులు ఏం చెబితే అది చేస్తున్నారు. పాదయాత్రకు వెళ్లి జగన్ కు కలవమంటే కలుస్తున్నారు. వారిచ్చిన ప్రెస్‌నోట్లపై సంతకాలు పెడుతున్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టమంటే పెడుతున్నారు. పోసాని పూర్తిగా చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పోసానితో… ఎన్టీఆర్‌తో గొప్పగా చెప్పించి.. ఆయనను చంద్రబాబు అన్యాయం చేశారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో పోసాని పావలా చేయమంటే ముప్పావలా యాక్షన్ చేస్తున్నారు. దాంతో… పోసాని తీరుపై… వైసీపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇంత కాలం… వైసీపీకి జనచైతన్య వేదిక అనే స్వచ్చంద సంస్థ ఏపీ విభాగం అటూ ఇటుగా మద్దతు ఇస్తూండేది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. జనచైతన్య వేదిక పేరుతో… ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడానికి … ఆ వేదికకు చెందిన లక్ష్మణరెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు అంటూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అలాగే.. ఇప్పుడు కొత్తగా ఏపీలో మద్యం ఏరులై పారుతోందన్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ అన్ని అంశాల్లోనూ చంద్రబాబు విధానాలను, వ్యక్తిత్వాన్నే నేరుగా టార్గెట్ చేసుకున్నారు.

పైన అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసేవారే. కానీ ఏ ఒక్కరు కూడా.. తమకు వైసీపీతో సంబంధం ఉందని ఒప్పుకోరు. జగన్ సీఎం కావాల్సిందేనంటారు. చంద్రబాబును అడ్డదిడ్డంగా తిడతారు. కానీ వైసీపీతో సంబంధం లేదంటారు. ఇదంతా వైసీపీ స్ట్రాటజీ. చంద్రబాబు ఇమేజ్‌ను జగన్ స్థాయికి తీసుకు రావాలన్న తాపత్రయమే. కానీ ప్రజలు ఐవైఆర్, కల్లాం అజయ్ రెడ్డి, పోసాని , జనచైతన్య వేదిక అన్నీ వైసీపీలో భాగమన్నట్లుగానే భావిస్తున్నారు. దాంతో వారి ప్లాన్ వర్కవుట్ అవడం కష్టంగా మారిందన్న అభిప్రాయాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com