ప్రభుత్వంపై అక్రమ మైనింగ్ మరక పడాల్సిందే..! లేకపోతే జగన్ శాంతించలేడా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ పాలిటిక్స్ చేస్తూంటారు. చాలా… చాలా సీరియస్ గా పాలిటిక్స్ చేస్తున్నా అని అని అనుకుంటారు. ఈ విషయంలో తన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి..? ఎలాంటి విషయాలను తాను ఏ పద్దతిలో ప్రశ్నించాలన్న విషయాలపై మాత్రం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోరు. అందుకే కాస్త సీరియస్ కామెడీ అయిపోతూ ఉంటుంది. కొన్నాళ్ల క్రితం.. ఓ ఇంటర్యూలో తాను అధికారంలోకి రాగానే…. అవినీతి ఇట్టే ఒడిసి పట్టేసుకుని… ఒక్క వేటుకు అంతం చేసేస్తా అన్నారు. అదీ కూడా చాలా సీరియస్ గా.. తన కంటే కంకణబద్ధుడు ఇంకెవరూ ఉండరన్నట్లుగా ఆ స్టేట్‌మెంట్ ఉంది. కానీ జగన్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. ఎవరైనా పుసుక్కున నవ్వకుండా ఉంటారా..?

అచ్చంగా అలాగే.. ఇప్పుడు అక్రమ మైనింగ్ పై కూడా జగన్ తెగ మాట్లాడేస్తున్నారు. పల్నాడులో అక్రమ మైనింగ్ అంటూ…. కొద్ది రోజులుగా వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. దానిపై కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించారు. వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి… చాలా పెద్ద రేంజ్‌లో ఊహించుకుంటోంది. కడప జిల్లాలో బైరైటీస్ గనుులు, అనంతపురం జిల్లాలో ఓబులాపురం గనులను… అక్కడి ఘనులు దోచినట్లుగా…. ఇక్కడ పల్నాడులోనూ దోచారని చెప్పడానికి గోరంతను కొండంతగా విడమర్చి చెప్పడం ప్రారంభించారు. కొన్ని వందల మంది… కొన్ని వేల లారీలతో.. ఏళ్ల తరబడి… అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి గుండెలు బాదేసుకున్నారు. పల్నాడు మైనింగ్‌ తో పోలిస్తే.. ఓబులాపురం, మంగంపేట బైరైటీస్ గనుల తవ్వకాలు చాలా చిన్నవిని చెప్పాలని తాపత్రయ పడుతున్నారు.

ఈ అక్రమ మైనింగ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ… ఎమ్మెల్యే యరపతినేనిని ఇరికించాల్సిందేనని పట్టుదలతో ఉన్న వైసీపీ చివరికి కోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీఐడీ విచారణనూ విమర్శించేస్తోంది. సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి.. యరపతినేనికి క్లీన్ చిట్ ఇచ్చేస్తారని… ముందుగానే ఆరోపిస్తోంది. అంటే… వైసీపీ ఉద్దేశం ప్రకారం.. యరపతినేని నిందితుడిగా మారిస్తేనే… విచారణ సరిగ్గా జరిగినట్లు లేకపోతే లేదు. అయినా అక్రమ మైనింగ్ అంటే గుర్తుకు వచ్చేది… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయామే. రాష్ట్రాల సరిహద్దుల్ని …సుంకులమ్మ గళ్లనూ కొల్లగొట్టేసి…. ఖనిజ సంపదను దోచేసుకున్న ఘనులు ఆ హయాంలోనే ఉన్నారు. చివరికి ఖమ్మం జిల్లా బయ్యారంలో ఏకంగా లక్షా నలభై వేల ఎకరాలను తన అల్లుడికి చెందిన రక్షణ కన్సార్టియంకు వైఎస్ మైనింగ్ కు అప్పగించడం.. ప్రజల్ని నివ్వెర పరిచేలా చేసింది. అదంతా.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతలు లేకుండా సాగించిన దందానే. ఇప్పుడు అలాంటిదే పల్నాడులో జరిగిందని.. నిరూపించాలని వైసీపీ తాపత్రయ పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com