వారెవ్వా.. వైసీపీ రాజకీయం…! జరగని ఎన్నికకు వ్యతిరేక ఓటు..!!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో… బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంలో విశేషం ఏమిటంటే.. ఇంత వరకూ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఏ ఒక్క పార్టీ కూడా.. చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా.. ఇంత వరకూ తమ విధానం ఇదీ అని ప్రకటించలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం… “ఏదో ఆశించి..” ముందుగానే నిర్ణయాన్ని ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించింది.

నిజానికి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి జూలై 2న ఖాళీ అయింది. మామూలుగా పద్దెనిమిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. కానీ ఆ పదవిని దక్కించుకోవడానికి రాజ్యసభలో మెజార్టీ లేనందున.. ఎన్నిక నిర్వహించకూడదని.. బీజేపీ దాదాపుగా నిర్ణయించింది. తమకు మెజార్టీ సమకూర్చుకునే వరకూ వాయిదా వేయాలనుకంటోంది. పదవీ కాలం పూర్తయిన డిప్యూటీ ఛైర్మన్‌ స్థానంలో కొత్తవారిని ఎంత గడువులోగా ఎన్నుకోవాలో తెలిపే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదనే వాదన బీజేపీ తీసుకొచ్చింది.

రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు 123 ఓట్లు అవసరమవుతాయి. ఎన్డీఏలో లేని పార్టీలన్నింటనీ విపక్షంగా పరిగణిస్తే ఆ శిబిరంలో 134 ఓట్లు ఉన్నట్లే. అయితే.. వీటిలో బీజేడీ, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ లాంటి పార్టీలు బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తాయి. అయినా మెజార్టీకి తగ్గ ఓట్లు సరిపోవు. రాజ్యసభ చైర్మన్ ఒక్కరే సభ నిర్వహించడం కష్టం కాబట్టి… డిప్యూటీ చైర్మన్ అవసరం ఉంటుంది. కానీ తాత్కలిక డిప్యూటీ చైర్మన్ ను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి ఎన్నిక అవసరం లేదు. ప్రభుత్వం ఈ విధానానికే మొగ్గు చూపుతోంది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ఎలాంటి నోటిఫికేష్ లేకపోయినా.. ఇప్పుడు హడావుడిగా జగన్ నిర్ణయం తీసుకోడానికి కారణ…తాము ఇప్పటికిప్పుడు… బీజేపీకి వ్యతిరేకమని చెప్పుకోవాలనే తాపత్రమేనన్న భావన ఇతర రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. నిజంగా.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగి.. బీజేపీకి.. రెండు సీట్లే తక్కువ పడితే.. వైసీపీకి కనీసం బాయ్ కాట్ చేసేంత చాయిస్ కూడా ఉండదన్నది ఢిల్లీ వర్గాలు చెబుతున్న సమాచారం. ఇప్పటికిప్పుడు ఇమేజ్ మేకోవర్‌ కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా అంటే.. వైసీపీ కాంగ్రెస్‌కు ఓటేస్తుందా.. ..?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న విధానపరమైన నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. బీజేపీకి వ్యతిరేకించడమే కాదు.. బీజేపీని వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న నిర్ణయాన్ని ప్రకటించారు.. ఆ పార్టీ నేత ధర్మానప్రసాదరావు. నిజానికి ఇప్పటికిప్పుడు… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్న గ్యారంటీ లేదు. వాయిదా వేయాలని కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతోంది. అయినా సరే.. వైసీపీ నిర్ణయం తీసుకుంది కాబట్టి.. వైసీపీ ఎవరికి ఓటేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రాజ్యసభలో వైసీపీకి ఇద్దరు మాత్రమే సభ్యులున్నారు. కానీ ఆ రెండు ఓట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కీలకం కానున్నాయి. రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ లకు కానీ..వాటి కూటములకు కానీ మెజార్టీ లేదు. బీజేపీకి 69, కాంగ్రెస్‌కు 51 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏకు 106, యూపీఏకు 112 సీట్లు ఉన్నాయి. ఎవరూ కూడా సొంతంగా డిప్యూటీ చైర్మన్ పోస్టును పొందలేరు. అందుకే ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలన్నీ… కాంగ్రెస్, బీజేపీల వైపు చీలిపోయాయి. కానీ రెండు జాతీయ పార్టీల మధ్య దాగుడుమూతలాడుతున్న పార్టీలు నాలుగు ఉన్నాయి. ఒడిషాలో బీజేడీ, తమిళనాడులో అన్నాడిఎంకే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్. వీటిలో ఇప్పటికే బీజేడీ, అన్నాడీఎంకే కొన్ని చర్యల ద్వారా కాంగ్రెస్ కు దూరమని స్పష్టం చేశాయి. అంటే బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు పంపాయి.

భారత పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం.. న్యాయంగా డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ పదవులు ప్రతిపక్షాలకు రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. అంటే.. బరిలో ఉండేది కాంగ్రెస్ అభ్యర్థి అయితే.. వైసీపీ మద్దతిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ నేతలు చెప్పారు కానీ.. కాంగ్రెస్‌కు మద్దతుగా వేస్తామని చెప్పలేదు. ఒక వేళంగా ఎన్నికంటూ జరిగితే.. బాయ్ కాట్ చేసి అయినా.. తప్పించుకుంటారు కానీ.. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రయత్నం మాత్రం చేయకపోవచ్చు. ఈ విషయంలో కూడా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో సమన్వయంతోనే వెళ్తోందన్న ఊహాగానాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. అసలు ఎన్నిక జరిగినప్పుడే.. వైసీపీ వ్యూహం బయటపడుతుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com