”మగాళ్ల ప్రేమకు గుర్తుగా పాలరాతి మందిరాలు, భాగ్యనగరాలూ ఉన్నాయి.
మరి ఆడదానికి ప్రేమకు..? మనసులోనే సమాధి చేసుకోవడం తప్ప?!”
– ‘8 వసంతాలు’ ట్రైలర్లోని డైలాగ్ ఇది. ఈ సినిమా కథేమిటో, దాని డెప్త్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక్కటి సరిపోతుంది. ఫణీంద్ర దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈనెల 20న విడుదల అవుతోంది. అనంతిక, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని అందించారు. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లో ప్రేమ గురించి చెప్పిన డైలాగులు యువతరాన్ని థియేటర్లకు రప్పించేలా ఉన్నాయి.
ప్రేమలోని ఆర్థ్రత, స్వచ్ఛత చెప్పే కథతో ఈ సినిమాని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ట్రైలర్ కూడా దాన్ని ప్రతిబింబిస్తుంది. అనంతిక పాత్ర చుట్టూ తిరిగే సినిమా ఇది. ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారనిపిస్తోంది. ఓ అమ్మాయి క్యారెక్టరైజేషన్ నేపథ్యంలో ఈమధ్య పెద్దగా సినిమాలు రావడం లేదు. కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హావాలో.. ‘8 వసంతాలు’ కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. విజువల్స్ కూల్ గా ఉన్నాయి. ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చూడాలనుకొనేవాళ్లకు ఈవారం ఈ సినిమా మంచి ఆప్షన్ కావొచ్చు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది కాబట్టి మంచి థియేటర్లే దొరుకుతాయి. కాకపోతే ఈవారమే `కుబేర` వస్తోంది. దాంతో ఏమాత్రం పోటీ పడుతుందో చూడాలి.