ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల నిర్వచనాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మీటర్ల ఎత్తు అంటే సుమారు 5 లేదా 6 అంతస్తులు దాటిన భవనాలను ‘హైరైజ్’గా పరిగణించేవారు. అయితే, తాజా సవరణల ప్రకారం ఈ పరిమితిని 24 మీటర్లకు సుమారు 8 అంతస్తులు పెంచారు. అంటే 24 మీటర్ల ఎత్తు దాటితేనే ఆ భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు.
ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ప్రధాన లక్ష్యం. గతంలో 18 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసీ తీసుకోవడం తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల మధ్యస్థ స్థాయి భవన నిర్మాణాల్లో జాప్యం జరిగేది. ఇప్పుడు 24 మీటర్ల వరకు ఈ నిబంధనను సడలించడం వల్ల, చిన్న , మధ్య తరహా పట్టణాల్లో నివాస గృహాల నిర్మాణం వేగవంతం కానుంది.
కేవలం ఎత్తు మాత్రమే కాకుండా, రోడ్ల వెడల్పు నిబంధనలను కూడా ప్రభుత్వం సరళతరం చేసింది. 15 మీటర్ల ఎత్తు వరకు ఉండే భవనాలకు దరఖాస్తు చేయగానే అనుమతులు లభించేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని బలోపేతం చేశారు. అలాగే, 50 చదరపు మీటర్ల లోపు నిర్మించుకునే పేదల ఇళ్లకు కేవలం ఒక్క రూపాయికే అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
