భారత ఎన్నికల వ్యవస్థలో ముందెన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన స్వతంత్ర సంస్థలలో ఒకటి. అయితే, ఇటీవల కాలంలో ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చినప్పుడల్లా విపక్షాలు ఈవీఎంలను, ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టడం ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఏకంగా సీఈసీపైనే అభిశంసన తీర్మానం పెట్టాలని 193 మంది ఎంపీలు నిర్ణయించడం.. దేశ ఎన్నికల వ్యవస్థ పునాదులపై దాడి చేయడమేనని అనుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల కమిషన్ స్వయంప్రతిపత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రక్రియలో లోపాలా.. రాజకీయ వ్యూహాలా?
ఎన్నికల ప్రక్రియలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని కోర్టుల దృష్టికి తీసుకెళ్లడం, ఆధారాలతో కమిషన్‌ను ప్రశ్నించడం సరైన పద్ధతి. కానీ, ఎటువంటి పటిష్టమైన సాక్ష్యాలు లేకుండా, కేవలం పక్షపాత వైఖరి అనే ఆరోపణలతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలని చూడటం ప్రమాదకరమైన ధోరణి. విపక్షాలకు ఈ తీర్మానాన్ని నెగ్గించుకునే బలం లేదని తెలిసినప్పటికీ, కేవలం సీఈసీ వ్యవస్థను ప్రజల దృష్టిలో బలహీనపరచడానికి, అనుమానాలు రేకెత్తించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
సంఖ్యాబలం లేని పోరాటం
రాజ్యాంగం ప్రకారం సీఈసీని తొలగించాలంటే ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ తీర్మానం వీగిపోవడం ఖాయం. అయినా సరే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ముందుకు వెళ్లడం వెనుక.. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల ఫలితాలకు ముందే ఒక నేరేటివ్ సిద్ధం చేసుకోవాలనే రాజకీయ వ్యూహం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వ్యవస్థలను సంస్కరించడం కంటే, వాటిపై నిందలు వేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దేశ ప్రయోజనాలకు విఘాతమని వారికి తెలియకుండా ఉండదు.
ప్రజాస్వామ్యానికి చేటు
ఎన్నికల కమిషన్ వంటి సంస్థలు బలహీనపడితే అది అంతిమంగా ప్రజాస్వామ్యానికే నష్టం కలిగిస్తుంది. ఒక వ్యక్తిపై ఉన్న అసంతృప్తిని వ్యవస్థపై దాడిగా మార్చడం సరికాదు. గతంలో అనేక సందర్భాల్లో ఇదే కమిషన్ పర్యవేక్షణలో విపక్షాలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ పరాజయాలకు కారణాలను వెతుక్కునే క్రమంలో రాజ్యాంగ సంస్థలను కారణాలుగా చూపించడం మంచి పద్దతి కాదు. కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే ఈ అభిశంసన తీర్మానం ఒక నిరసనగా మిగిలిపోతుందా లేక భారత ఎన్నికల చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలుస్తుందా అన్నది వేచి చూడాలి.


