తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సినీ నటుడు విజయ్, ఒక ఫ్యాన్ ఇచ్చిన ఫోటోను పట్టుకుంటే.. దాన్ని వైఎస్ జగన్ అభిమానులు తమకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా భావించడం ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద కామెడీగా మారింది.
తమిళనాడులో విజయ్ ఎన్నికల ప్రచారంలో తన అభిమాని ఇచ్చిన ఫోటోను రెండు సెకన్లు చూపించారు. ఆ ఫోటోలో విజయ్‌తో జగన్ ఉన్నారు. ఈ ఫోటో చూడగానే ఏపీలోని పేయిడ్ కార్యకర్తలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. తమిళనాడులో జగన్ గర్జన , విజయ్ ఆదర్శం జగన్ అన్న అంటూ గ్రాఫిక్స్ వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. పాపం, విజయ్‌కు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కనీసం ఐడియా ఉందో లేదో కూడా తెలియదు కానీ, వైసీపీ వాళ్లు మాత్రం దీన్ని దక్షిణాది రాజకీయాల్లో జగన్ ప్రభంజనం అని కలరింగ్ ఇస్తున్నారు.
జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు . కానీ విజయ్ ఇంకా రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దలేదు, కనీసం ఒక్క వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. అలాంటి నేత ఫోటో చూపిస్తే మురిసిపోవడమంటే.. జగన్ అభిమానుల అల్పసంతోషం ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ సీఎం ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి ఒక తమిళ హీరో సాయం కావాల్సి రావడం నిజంగా రాజకీయ వైచిత్రి.
చెన్నైలో ఎవరో ఒక అభిమాని ఇచ్చిన ఫోటోను పట్టుకుంటే దాన్ని జగన్ గర్జన అని ప్రచారం చేసుకుంటున్న వారు.. ఇక్కడ ఏపీలో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి కళ్లు తెరిచి చూస్తే బాగుంటుందన్న సెటైర్లు పడుతున్నాయి. సొంత రాష్ట్రంలో జన సమీకరణకోసం తంటాలు పడుతూంటే రాష్ట్రం హీరోలు ఫోటోలు చూపిస్తున్నారని సంబరపడటం గోడమీద పిల్లికి కూడా సింహం ఎలివేషన్ ఇవ్వడం లాంటిదే. విజయ్ ఏదో యాదృచ్ఛికంగా చేసిన పనిని, తమ రాజకీయ మనుగడకు వాడుకోవాలనుకోవడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనం.
