సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజీ ఇస్తే తప్ప సినిమాలు ఆడనివ్వం అని ఎగ్జిబీటర్లు మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారు. దీనిపై నిర్మాతలు కూడా తక్షణం స్పందించాల్సి వచ్చింది. ‘పెద్ది ‘ రిలీజ్కు ముందు జరుగుతున్న ఈ పంచాయితీలో ఈరోజు.. నిర్మాతలు తమ గళం గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. పర్సంటేజీ విధానానికి నిర్మాతలు కూడా రెడీనే. కానీ కొన్ని కండీషన్లు పెట్టారు. మరీ ముఖ్యంగా కొన్ని సింగిల్ స్క్రీన్లు చెత్త కుండీలకంటే అధ్వాన్నంగా ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. కోట్లు పెట్టి కట్టిన కొత్త థియేటర్లకూ, అసలేమాత్రం సౌకర్యాలు లేని సింగిల్ స్క్రీన్నీ ఒకే కంటితో చూడడం ఏమిటన్న నిర్మాతల ప్రశ్న సహేతుకమైనదే అనిపిస్తోంది.
ఈరోజు హైదరాబాద్ లో జరిగిన నిర్మాతల ప్రెస్ మీట్ లో.. ఎగ్జిబీటర్ల ప్రశ్నలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చే ప్రయత్నం అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా ఏమాత్రం సౌకర్యాలు లేని చిన్న థియేటర్ల వైఖరిపై నిర్మాతలు తమదైన నిరసన వ్యక్తం చేశారు.
”ముక్కు మూసుకోకుండా టాయిలెట్ కి వెళ్లగలిగే పరిస్థితి ఎక్కడుంది” అని స్వయంగా మైత్రీ మూవీస్ రవినే… నిలదీశారు. ఇలాంటి థియేటర్లకు కూడా పర్సంటేజీ ఇవ్వాలంటే నిర్మాతలకు మనసెక్కడ ఒప్పుతుంది..? ఇటీవలే విమల్ థియేటర్ ని రెన్నోవేట్ చేశారు. అందుకోసం కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టే… ఈరోజు విమల్ లాభాల్లో నడుస్తోందని మైత్రీ రవి అంటున్నారు. ఇలాగే మిగిలిన సింగిల్ స్క్రీన్లు కూడా రెన్నోవేట్ చేసుకొంటే, తప్పకుండా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయన్నది ఆయన మాట.
విశాఖపట్నంలో మల్టీప్లెక్సులు చాలా ఉన్నాయి. కానీ.. అక్కడ సింగిల్ స్క్రీన్లదే హవా. సంగం లాంటి సింగిల్ స్క్రీన్లకు అక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. అవన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. అలాంటి థియేటర్లు నైజాంలోనూ ఉంటే… ఎగ్జిబీటర్లు నష్టపోవడం అంటూ ఉండదు కదా అన్నది నాగవంశీ మాట.
పైగా రెంటల్ వ్యవస్థ తీసేసి, పర్సంటేజీ ఇస్తే .. నిజమైన థియేటర్ యజమానికి రూపాయి కూడా చేతికి అందదు… అసలు మేం ఇస్తున్న రూపాయి థియేటర్ యజమానికి వెళ్తుందా, లేదా అనే విషయం సీబీఐ సంస్థలకు కూడా తెలీదంటూ…. నాగవంశీ ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో నిజం ఉంది. చాలామట్టుకు థియేటర్లు లీజు దారుల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు పర్సంటేజీ తీసుకురావడం వల్ల థియేటర్ యజమాని ఏం బాగుపడడు. లీజు దారులకు తప్ప ఇంకెవ్వరికీ మేలు జరగదు. నిర్మాత నష్టపోయి ఎవరి జేబులు నింపడానికి పర్సంటేజీలు ఇవ్వాలన్నది నిర్మాతల సూటి ప్రశ్న. వీటికి ఎగ్జిబీటర్ల దగ్గర సమాధానాలు ఉన్నాయా?


