‘మేజ‌ర్’ ట్రైల‌ర్‌: నిలువెల్లా.. ఉద్వేగం

26/11… భార‌త దేశ చ‌రిత్ర‌లో ర‌క్తాక్ష‌రాల‌తో లిఖించ‌దిగిన రోజు. దేశ భ‌ద్ర‌త‌ని ప్ర‌శ్నించిన రోజు. ఉగ్ర‌మూక‌లు ముంబైపై విరుచుకుప‌డిన రోజు. భార‌త బ‌ల‌గాలు కూడా.. త‌గిన‌రీతిలో స్పందించాయి. ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. చివ‌రికి… విజ‌యం సాధించారు. త‌ర‌వాత‌.. అదో చ‌రిత్ర‌గా మారిపోయింది. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ ఈ ఘ‌ట‌న‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న క‌థ‌ని.. ఇప్పుడు `మేజ‌ర్‌`గా చూపిస్తున్నారు. అడ‌విశేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది.

దేశంమీద ప్రేమ‌తో.. ఆర్మీలో అడుగుపెట్టిన ఓ యువ‌కుడి క‌థ ఇది. త‌న జీవితం.. కుటుంబం, ప్రేమ‌, పెళ్లి.. వీట‌న్నింటికీ అతీత‌మైన దేశ‌భ‌క్తిని ఈ క‌థ‌లో చూపించారు. ప్ర‌కాష్‌రాజ్ డైలాగులు ఉద్వేగంగా ఉన్నాయి. అప్ప‌టి దాడిని.. తెర‌పై క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే రాంగోపాల్ వ‌ర్మ ఓ సినిమా తీశాడు. అయితే.. ఇంకా ఎన్నో ప్ర‌శ్న‌లు శేషాలుగా మిగిలిపోయాయి. వాటికి స‌మాధానం ఈ సినిమాలో ద‌క్కుతుందేమో చూడాలి. మేజ‌ర్ సందీప్ గా… అడ‌విశేష్ చ‌క్క‌గా స‌రిపోయాడు. త‌న‌కు ఇది మ‌రో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్ర‌మ‌వుతుంద‌నిపిస్తోంది. తాజ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి ఇది. ఆ వాతావ‌ర‌ణం.. అప్ప‌టి భ‌యాన‌క దృశ్యాల్ని తెర‌పై రిప్లికా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్టే క‌నిపిస్తోంది. “మైస‌న్ మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌. వెన‌క‌డుగు వేసే అవ‌కాశం ఉంది. త‌ప్పించుకునే దారి ఉంది. ముందుకెళ్తే చ‌నిపోతాడ‌ని తెలుసు. ఐనా వెళ్లాడు. చావు క‌ళ్ల‌ల్లోకి చూసి నువ్వు నా జీవితాన్ని తీసుకెళ్ల‌గ‌ల‌వు కానీ దేశాన్ని కాదు.. అన్నాడు..` అంటూ ఉద్వేగంగా చెప్పిన సంభాష‌ణ గుండెల్ని పిండేశాలా వినిపించింది. `నా కొడుకు జీవితం ఆ రోజు జ‌రిగిన ఎటాక్స్ మాత్ర‌మే కాద‌మ్మా.. సందీప్‌కంటూ ఓ జీవితం ఉంది..` అనే రేవ‌తి డైలాగ్ తో ట్రైల‌ర్ ముగించారు. మొత్తానికి.. ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చూడబోతున్నామ‌న్న న‌మ్మ‌కాన్ని ఇచ్చింది ఈ సినిమా. అన్ని స‌రిగ్గా కుదిరితే… `ఉరి` లాంటి.. గొప్ప ప్ర‌య‌త్నంగా `మేజ‌ర్‌` మిగిలిపోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.