అ.అ.ఆ. టీజ‌ర్‌: బ‌లాలు బాగున్నాయ్‌!

శ్రీ‌నువైట్ల సినిమాలెలా ఉంటాయో అంద‌రికీ తెలుసు. వినోదం డోసు ఎక్కువ‌గా ఉండి, యాక్ష‌న్ ట‌చ్‌లో సాగుతూ.. అల‌రిస్తాయి. ఈ ఫార్ములానే శ్రీ‌నువైట్ల‌కువిజ‌యాల్ని అందించింది. అయితే… క్ర‌మంగా ఫార్ములా అనే ఛ‌ట్రంలో బిగిసుకుపోయిన శ్రీ‌నువైట్ల – వ‌రుస‌గా వైఫ‌ల్యాలు అందుకున్నాడు. కొంత బ్రేక్ త‌ర‌వాత చేస్తున్న సినిమా `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`. శ్రీ‌నువైట్ల‌కు అచ్చొచ్చిన ర‌వితేజ‌ని క‌థానాయ‌కుడిగా ఎంచుకున్నాడు. త‌ను త‌ప్ప‌కుండా మారాల్సిన త‌రుణంలో… ఆ మార్పుని టీజ‌ర్‌లో చూపించాడు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` టీజ‌ర్ ఈరోజు విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే.. శ్రీ‌నువైట్ల కొత్త‌గా ఏదో చెప్పాల‌నుకుంటున్నాడు అనేది మాత్రం స్ప‌ష్ట‌మైంది. శ్రీ‌ను సినిమాల్లో క‌నిపించే ఊర మాస్ ఎలిమెంట్స్, పంచ్ డైలాగులు ఇవేం టీజ‌ర్‌లో లేవు.

”ముగింపు రాసుకున్న త‌ర‌వాతే క‌థ మొద‌లు పెట్టాలి” అనే డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌లైంది.

”వాడు ఎక్క‌డుంటాడో, ఎలా ఉంటాడో, ఎలా వ‌స్తాడో ఎవ‌డికీ తెలీదు” లాంటి డైలాగుల‌తో.. ఇదో విల‌న్ల‌తో హీరో ఆడుకునే దాగుడు మూత‌ల ఆట అనేది అర్థ‌మైంది. ర‌వితేజ డైలాగ్‌, చివ‌ర్లో మూడు రూపాల్లో క‌నిపించ‌డం ఈ క‌థ‌కు, టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ జ‌రిపించ‌డానికే. ఫ‌స్ట్ షాట్ చూస్తే.. ఇది రిజైండ్ డ్రామాలా క‌నిపించింది. టెక్నిక‌ల్‌గా చూస్తే.. ఈ సినిమాకి మైత్రీ మూవీస్ ఎలాంటి లోటు రానివ్వ‌లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తీ ఫ్రేమూ చాలా రిచ్‌గా క‌నిపించింది. ఇలియానా చాలాకాలం త‌ర‌వాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. టీజ‌ర్‌లో త‌న‌కూ రెండు డైలాగులు ఇచ్చారు. ఈ సినిమాలో క‌మెడియ‌న్‌గా క‌నిపించ‌నున్న సునీల్‌ని మాత్రం ఒక్క ఫ్రేములోనూ చూపించ‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కావ‌ల్సిన బ‌లాల‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. టీజ‌ర్‌లో క‌నిపించిన వైవిధ్యం, క్లాస్ ట‌చ్ సినిమాలోనూ ఉంటే.. శ్రీ‌నువైట్ల నిరీక్ష‌ణ ఫ‌లించిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.